బంజారాహిల్స్, జూలై 17: వర్షాకాలం ప్రారంభం అయింది. వర్షాలతో పాటే ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా,డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కిల్-18 ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. లార్వా దశలోనే దోమలను నివారించడం కోసం సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ. షేక్‌పేట డివిజన్ల పరిధిలో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోకి వచ్చే జలగం వెంగళరావు పార్కు, బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోకి వచ్చే తాజ్ బంజారా చెరువు, షేక్‌పేట డివిజన్ పరిధిలోకి వచ్చే కొత్త చెరువులో దోమలను నిర్మూలించేందుకు డ్రోన్ల ద్వారా అయిల్ను పిచికారీ చేయిస్తున్నారు. మూడు చెరువులలో నెలకు రెండుసార్లు డ్రోన్ల ద్వారా మస్కిటో లార్వాసైట్(ఎంఎల్వో) ద్రావణా న్ని పిచికారీ చేయిస్తున్నారు. వీటితో పాటు వర్షాలకారణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల నివారణపై దృష్టి పెట్టారు. దీంతో పా టు డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకం గా సిబ్బందిని నియమించి దోమల నివారణను చేస్తున్నారు. గతంలో ఎక్కువగా డెంగీ కేసులు నమోదయిన ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో యాంటీలార్వా ఆపరేషన్‌ను క్రమం తప్పకుండా చేస్తున్నారు.
వర్షాకాలంలో దోమల ఉధృతి పెరగకుండా ఫాగింగ్ కోసం ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. సర్కిల్ 18 పరిధిలో ఫాగింగ్ కోసం ప్రత్యేకంగా 18మంది సభ్యులతో యూనిట్ పనిచేస్తుంది. వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ యంత్రాలతో పాటు పోర్టబుల్ ఫాగింగ్ మెషీన్ల( పీఎఫ్‌ఎమ్) ద్వారా అన్ని బస్తీలు. కాలనీల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయిస్తున్నారు. ఫాగింగ్‌పై స్థానికుల నుంచి ఫిర్యాదులు రా కుండా ముందుగానే నిర్దేశిత ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఎంటమాలజీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సర్కిల్లో దోమల నివారణ కోసం సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా చెరువుల్లో గుర్రపు డెక్క ఆకును తొలగించడంతో పాటు యాంటీ లార్వా ఆపరేషన్‌ను క్రమం తప్పకుండా చేపడుతున్నాం. లార్వా దశలోనే దోమలను చంపేందుకు డ్రోన్ల ద్వారా చెరువుల్లో మందును పిచికారీ చేయిస్తున్నాం. అదే విధంగా దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
– రజిత, ఏఈ ఎంటమాలజీ విభాగం