శేరిలింగంపల్లి, జూన్ 17 : శేరిలింగంపల్లిలో బీజేపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు ప్రధాన నాయకులు మధ్య కొనసాగుతున్న వర్గపోరు మరోమారు ఘర్షణకు దారితీసింది. మజీద్బండ గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నేత గజ్జల యోగానంద్, అనుచరుల కార్లపై బీజేపీ యవనేత రవికుమార్ యాదవ్ అనుచరులు రాళ్లదాడి చేశారు. ఈ విషయమై యోగానంద్ వర్గీయులు స్థానిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. మీ సమస్య-మా పోరాటం పేరుతో శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు యోగానంద్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో 62వ రోజు కొండాపూర్ మజీద్బండ గ్రామంలో రాత్రి 7.30 గంటల సమయంలో మజీద్బండ కమ్యూనిటీ హాలు సమీపంలో బీజేపీ నాయకులు కార్లు నిలిపి బస్తీలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. బీజేపీ యువ నాయకుడు రవికుమార్ యాదవ్ నివాసం సమీపంలో ఉన్న సదరు కమ్యూనిటీ హాలు వద్ద వీరు తమ కార్లు నిలిపి వెళ్లారు. దీంతో యోగానంద్ ఫార్చూనర్ కారు (టీఎస్08జీపీ 0333), మారుతీ ఎర్టిగా కారు (టీఎస్ 30జే 59 13)తో పాటు మారుతి స్విఫ్ట్, బ్రీజా మొత్తం నాలుగు కార్ల అద్దాలను మరో వర్గం బీజేపీ నాయకులు పగులకొట్టారు. దాదాపు 15 మంది రాళ్లతో దాడిచేసి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.
బీజేపీ నాయకుడు యోగానంద్ అనుచరులు, మరో నేత రవికుమార్ యాదవ్ అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాసేపటికి యోగానంద్ వర్గీయులు పాపిరెడ్డికాలనీకి చెందిన కాంచన గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 341,427,506, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు.