GHMC | సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ వాయిదా పడింది. వచ్చే నెల 9 తేదీ తర్వాత మరోసారి సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదన స్టాండింగ్ కమిటీ సభ్యుల ముందు చర్చకు రానున్నది. రూ. 8,340 కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు శనివారం మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఫైనాన్స్ విభాగం అదనపు కమిషనర్ వివరించారు. గ్రేటర్లో చేపట్టబోయే అభివృద్ధి పనులు, నిర్వహణ , గత ఏడాది కంటే పెరిగిన సవరణ బడ్జెట్‌పై వివరించారు. అయితే ఆదాయ మార్గాలను తక్కువ చూపడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గడిచిన మూడేండ్లలో ఆదాయ రాబడిలో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రకటన విభాగం, ఎస్టేట్ విభాగం, ఆస్తిపన్ను, టౌన్ ప్లానింగ్, ట్రేడ్ లైసెన్స్‌లలో లోపాలను ఎత్తి చూపారు. ముఖ్యంగా ఆస్తి పన్ను వసూళ్లను ప్రతి ఏటా నామామాత్రంగానే పెంచుకుంటూపోతుండడం, ఆస్తిపన్ను చెల్లింపుల్లో పారదర్శకత లోపించింది. ప్రతి ఏటా ఆశించిన స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్లు పెరగడం లేదు. దాదాపు ఏటా రూ. 2500 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా, రూ. 1900 కోట్ల వరకు మాత్రమే వస్తున్నది. 2023-24లో రూ.1923.83 కోట్లు, 2024-25లో రూ.1907 కోట్లు అంచనాలు రూపొందించగా, 2025-26లో 2005 కోట్లుగా అంచనాలు వేశారు. ట్యాక్స్‌ను పెంచుకునేందుకు రూ. 22 కోట్లతో జీఐఎస్ సర్వే మొదలు పెట్టిన ఈ విధానంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ఎస్టేట్ ఆదాయం పక్కదారి
జీహెచ్ఎంసీలో ఎస్టేట్ విభాగం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని అనడానికి తగ్గిన ఆదాయమే నిదర్శనంగా చెప్పొచ్చు. సొంత ఆస్తుల విభాగమైన ఎస్టేట్‌లో గడిచిన రెండేండ్లలో ఆదాయం భారీగానే పడిపోయింది. 2023-24లో రూ.19.47కోట్లు వసూలు కాగా 2024-25లో రూ.17కోట్లను ప్రతిపాదించారు. గత సెప్టెంబర్ నాటికి కేవలం రూ. 5.47 కోట్లు మాత్రమే వసూలు చేశారు. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమే..గడువు ముగుస్తున్నా ఏండ్ల తరబడి లీజును రద్దు చేయడం లేదు.
ఇందుకు కోఠిలో మోతీ మార్కెట్లో దశాబ్దాలకు పైబడి షాపుల లీజుల గడువు ముగిసినా నేటికి కొనసాగుతున్నాయి. గడువు ముగిసిన దుకాణాదారులను ఖాళీ చేయించలేక, కొత్తగా టెండర్లు పిలిచి పారదర్శకంగా నిర్వహణ చేపట్టి ఆదాయం పెంచాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025-26 సంవత్సర బడ్జెట్లో ఎస్టేట్ ఆదాయాన్ని రూ.18.19 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడిచిన రెండేండ్లలో ఎస్టేట్ ఆదాయాన్ని పరిశీలిస్తే ఎస్టేట్ ఆదాయం రూ. కోటి తక్కువగానే ప్రతిపాదించడంపై ఆదాయాన్ని సక్రమంగా వసూలు చేయడం లేదన్న విషయం తేలిపోయింది.
ట్రేడ్ లైసెన్స్‌లపై పట్టింపేదీ?
జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాల్లో కీలకమైనది ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, రెన్యువల్. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రతిపాదనలకు, కలెక్షన్లకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. 2024-25లో రూ.110 కోట్లు ప్రతిపాదించగా, గత సెప్టెంబర్ నాటికి రూ. 15.27కోట్లు వసూలయ్యాయి. దీని బట్టి చూస్తే ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని పట్టించుకోవడం లేదని బడ్జెట్ లెక్కల్లో స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ సారి (2025-26)కు రూ. 92 కోట్లు ప్రతిపాదించారు.
ప్రకటన విభాగంలో అక్రమాలు
జీహెచ్ఎంసీ బ్రాండ్ ఇమేజీకి తగిన విధంగా కొత్త అడ్వర్టయిజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని, ఆదాయం పెంచుతామని గొప్పలు చెప్పిన జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో కొన్ని ఏజెన్సీలకు కొందరు అధికారులు కొమ్ముకాస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు. దాదాపు రూ. 100 కోట్ల మేర ఆదాయం రావాల్సిన చోట సగం మేర వసూలు అవుతూ మిగతా వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2023-24లో రూ. 46.48 కోట్లు, 2024-25కు సంబంధించి రూ.8.16 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. ఈ విభాగం ఆదాయం 2025-26లో రూ. 20.45 కోట్లుగా ప్రతిపాదించారు.
బడ్జెట్ రియలిస్టిక్‌గా లేదు..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ ప్రత్యేక సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్, 2025-26 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌పై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ గీతా రాధిక వివరణ ఇచ్చారు. పలు అంశాలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి పలు అంశాల్లో బడ్జెట్ ప్రతిపాదనలు (వాస్తవికంగా) రియలిస్టిక్‌గా లేవని , ఎస్టేట్, అడ్వర్టయిజ్మెంట్ బడ్జెట్ ఆదాయం తక్కువ చూపించారని సభ్యులు ఆరోపించారు. వారి సూచనలు పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలో మార్పులు చేసి తిరిగి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదం వాయిదా పడింది. వచ్చే వారంలో సమావేశం నిర్వహించి ఆమోదం పొందనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బడ్జెట్ సమావేశం తిరిగి ఈ నెల 9 తర్వాత నిర్వహిస్తామన్నారు.
ఆదాయం పెంచేలా బడ్జెట్ ఉండాలి: మేయర్
2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రతిపాదనలలో వృథా ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేలా బడ్జెట్‌ను రూపొందించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలు సకాలంలో అధికారులు అందించకపోవడం మూలంగా స్టడీ చేయలేకపోయామని సభ్యులు ఆరోపించారన్నారు. రూపొందించిన ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనలు కూడా కొన్ని అంశాలు రియలిస్టిక్‌గా లేనందున వాయిదా వేయాలని సభ్యులు కోరడంతో వాయిదా వేసినట్లు మేయర్ పేర్కొన్నారు.
అంకెల గారడి: స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆవుల రవీందర్‌రెడ్డి
ముసాయిదా బడ్జెట్ అంత అంకెల గారడీగా ఉంది. ఆదాయ మార్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అధికారుల పనితీరు ఏ మాత్రం సరిగా లేదు. ఆస్తిపన్ను వసూళ్లలో అక్రమాలు జరుగుతున్న పట్టడం లేదు. ప్రతి ఏటా ట్యాక్స్ కలెక్షన్లను నామమాత్రంగా పెంచుతూ వస్తున్నారు. గతంతో పోలిస్తే టౌన్‌ప్లానింగ్ ఆదాయాన్ని భారీగా తగ్గించారు. ఎస్టేట్ విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది.
పూర్తి వివరాలను వచ్చే సమావేశంలో వివరిస్తాం
– కమిషనర్ ఇలంబర్తి
ఆదాయ వనరులు పెంచుకున్నప్పుడు జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని కమిషనర్ ఇలంబర్తి అన్నారు. జీఐఎస్ సర్వే జోన్ వారీగా పూర్తయిందని, దాని ప్రకారం 24 లక్షలు గృహాలు ఉన్నాయని తెలిపారు. 1.25 ఇండ్ల సర్వే పూర్తి చేశామని, సర్వేయర్లను ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే తొందరగా ఫిజికల్ సర్వే పూర్తవుతుందని, ఆ దిశగా ముందుకు పోతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు వచ్చే సమావేశంలో వివరిస్తామని కమిషనర్ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
కేటాయింపులు ఇలా (రూ. కోట్లలో)
హెచ్-సిటీ రూ.2,242
సమగ్ర వ్యర్థాల నిర్వహణకు రూ.703
హెల్త్ అండ్ శానిటేషన్ రూ. 600
వీధి దీపాలు రూ. 344 .. రవాణా విభాగం రూ.105
పార్కులు రూ. 222.. ఇంకుడు గుంతలు రూ. 72
చెరువులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ రూ. 173
బడ్జెట్ సంక్షిప్త స్వరూపం (రూ.కోట్లలో)
రెవెన్యూ ఆదాయం రూ. 4205
రెవెన్యూ వ్యయం రూ. 3936
మూలధన రశీదులు 4,404
మూలధన వ్యయం 4,404