కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 24 : కాంగ్రెస్, జనసేన పార్టీల గారడి మాటలు నమ్మొద్దని.. 60 ఏండ్లలో చేయలేని పనులను పదేండ్లలో చేసి చూపించిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బాలాజీనగర్ డివిజన్లోని టి-అంజయ్యనగర్, ప్రగతినగర్, ఆంజనేయనగర్, హబీబ్‌నగర్, కైత్లాపూర్, సేవాలాల్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్, కేపీహెచ్‌బీ కాలనీ 1, 2వ ఫేజ్‌లలో కార్పొరేటర్ శిరీషాబాబురావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రూ.2వేల పింఛన్ ఇస్తున్నారా.? 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారా..? అని అన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాల కోసం మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పదేండ్ల కాలంలో కూకట్పల్లి ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందని, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు రిజర్వాయర్లు నిర్మించి తాగునీటి సమస్యను తీర్చామని తెలిపారు. కాలనీలు, బస్తీలలోని ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేశానని.. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తూ రోడ్లను బాగు చేసినట్లు చెప్పారు. రంగధాముని చెరువు, ముళ్లకత్వ చెరువులను ఆహ్లాదకరంగా సుందరీకరించినట్లు తెలిపారు. మరోమారు ఆశీర్వదిస్తే కూకట్‌పల్లిని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.