మణికొండ, నవంబర్ 24: మణికొండ మున్సిపాలిటీలో కమిషనర్ వర్సెస్ మాజీ మున్సిపల్ చైర్మన్ మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మున్సిపాలిటీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన విషయంలో కమిషనర్ ప్రదీప్‌కుమార్ అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్తో దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య అగ్గి రాజుకుంది. దీంతో ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు మాజీ చైర్మన్ ఫోన్‌చేసి కమిషనర్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేవారు. మాజీ ప్రజాప్రతినిధులను గౌరవించని అధికారులు మణికొండ మున్సిపాలిటీలో పనిచేసేందుకు వీలులేదని ఎమ్మెల్యే వద్ద పట్టుపట్టినట్లు సమాచారం. కమిషనర్‌ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందేనంటూ పట్టుపట్టడంతో ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ 15 రోజుల్లో కమిషనర్‌ను వేరేచోటుకు పంపింఇచవేస్తానని మాజీ చైర్మన్‌కు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
బదిలీ చేసేవరకు కార్యాలయానికి వచ్చేది లేదు..
ప్రస్తుత కమిషనర్‌ను బదిలీ చేసేంతవరకు తాను మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని, అప్పటివరకు తాను ఏ కార్యక్రమాలకు హాజరుకాలేనంటూ మాజీ చైర్మన్ శపథం బూనారని ఆయన అనుచరులు అంటున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌పై తమకు నమ్మకం ఉందని, కమిషనర్ బదిలీ విషయం ఆయనకే వదిలేశామని, నూతన కార్యాలయం ప్రారంభించి ఇప్పటికే ఐదురోజులు గడిచిందని మిగిలింది పది రోజులేనంటూ వారు అంటున్నారు. మా నేతను గౌరవించని అధికారులు మాకేందుకంటూ అధికార పార్టీ ద్వితీయశ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీలో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని వీటి వెనుక కమిషనర్ పాత్రే అధికంగా ఉందని వారు మండిపడుతున్నారు.
ప్రజాసొమ్ము దారి మళ్లింపు..
అక్రమ నిర్మాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరైనా ప్రశ్నించారా? అడ్డగోలుగా ఓసీల మంజూరు, ఇంజనీరింగ్ విభాగంలో కోట్లాది రూపాయల ప్రజాసొమ్ము దారిమళ్లించారంటూ అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇందుకు సంబంధించి సంపూర్ణ ఆధారాలు తమవద్ద ఉన్నాయని కమిషనర్‌ను మరో పదిరోజుల్లో బదిలీ చేయకపోతే అన్నీ ప్రజల ముందు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అధికారులు మణికొండ మున్సిపాలిటీలో కొనసాగితే అభివృద్ది కుంటుపడుతుందని విమర్శిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ చర్యలకు ఉపక్రమించకపోతే మా దారి మేం చూసుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది ఇలావుండగా కమిషనర్ ప్రదీప్‌కుమార్ మాత్రం తన వెనుక కూడా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఉన్నారన్న ధీమాతో ఉన్నట్లు సమాచారం. పార్టీలో క్రియాశీలకమైన నియోజకవర్గ ఇన్చార్జి, మున్సిపల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ వైపు ఎమ్మెల్యే ఉంటారా లేక కమిషనర్ వైపు నిలుస్తారా? అనే సందిగ్ధం ప్రస్తుతం మణికొండ మున్సిపాలిటీలో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి తెరపడాలంటే మరో పదిరోజులు వేచి చూడక తప్పదని స్థానికంగా టాక్ నడుస్తోంది.