మేడ్చల్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు రేషన్ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఆప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కోసం వచ్చే వినియోగదారులు ఈ-కేవైసీ చేసుకుంటే తప్ప.. రేషన్ అందించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ క్ర మంలో రేషన్ కార్డుల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రెండేండ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా.. ఎందుకు పూర్తి కావడం లేదన్నది ప్రశ్న. మేడ్చల్ జిల్లాలో 76 శాతం మాత్రమే ఇప్పటివరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 20లోపు మరో మిగిలిన 24 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కోటా ఉండదని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో 24 శాతం మందికి రేషన్ అందకపోతే ఆ పరిణామం ఎలా ఉంటుందోనన్న ఆందోళన రేషన్ డీలర్లలో మొదలైంది.
20,77,072 మంది కార్డుదారులు
మేడ్చల్ జిల్లాలో ఉన్న 6,31,033 రేషన్‌కార్డులకు సంబంధించి 20,77,072 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. గతంలో ఉన్న రేషన్ కార్డుదారులతో పాటు ఇటీవల మంజూరు చేసిన కొత్త కార్డుదారులు కూడా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మిగిలిన 24 శాతం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కాని పక్షంలో రేషన్ కోటా వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. 20 వరకు ముగింపు గడువు కాకుండా మరింత పెంచాలని రేషన్ కార్డుదారులు కోరుతున్నారు. అయితే ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు కొందరివి నమోదు కావడం లేదని పేర్కొంటున్నారు. ఈ-పాస్ యంత్రంలో నమోదు కాకుంటే తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
అందని సంక్షేమ పథకాలు..
మేడ్చల్ జిల్లాలో ఇటీవల మంజూరు చేసిన రేషన్‌కార్డుదారులకు ఇంకా సంక్షేమ పథకాలను మంజూరు చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యంతో పాటు వంటగ్యాస్, గృహజ్యోతి, ఉచిత కరెంట్ అందిస్తున్నారు. కొత్త కార్డులు పొందిన వారు ఈ పథకాలకు దూరంగానే ఉన్నారు. సన్న బియ్యం తప్ప.. కొత్త రేషన్ కార్డుల వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించేలా చూడాలని కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డులదారులు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.