Doctors Protests | సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. గ్రేటర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు శనివారం ఓపీ సేవలను బహిష్కరించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు.
పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు వైద్యుల ఆందోళనకు మద్దతు తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో వైద్యులపై దాడులు, అఘాయిత్యాలు వంటివి జరగకుండా తగిన భద్రత కల్పించాలని పలువురు డాక్టర్లు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
తులం బంగారమేది?.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మర్రి
మల్కాజిగిరి, ఆగస్టు 17: కల్యాణలక్ష్మి చెక్కులు సరే.. మరి తులం బంగారమేది ? అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం అల్వాల్ మండల కార్యాలయంలో 51 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. 51 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా రూ.1,00,116తో పాటు తులం బంగారం అందజేస్తామని ప్రసంగాల్లో ఊదరగొట్టిందన్నారు.
ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలవుతున్నా తులం బంగారం ఊసేలేదని విమర్శించారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే వారిని నట్టేట ముంచారన్నారు. చెక్కులు తీసుకున్న పేదింటి ఆడపడుచులు తులం బంగారమేదని ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నెరవేర్చేవరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్‌రెడ్డి, సబితాకిశోర్, నాయకులు అంజయ్య, పరశురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.