కంటోన్మెంట్, నవంబర్ 16: ‘మీ ఇంటి బిడ్డగా వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. అధిక మెజార్టీతో గెలిపించండి’ అని బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి గ్యాని లాస్యనందిత అన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆమె మూడో వార్డు అన్నానగర్, బాలంరాయిల్లో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. మూడో వార్డులో లాస్యనందితకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. బోర్డు మాజీ సభ్యురాలు అనితాప్రభాకర్ ఆధ్వర్యంలో బాలంరాయి, అన్నానగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఇంటింటికీ వెళ్లిన లాస్యనందితకి మహిళలు ఎదురొచ్చి బొట్టుపెట్టి మంగళహారతులతో స్వాగతం పలికి ఆశీర్వదించారు.
మరోపక్క అభివృద్ధికి సంబంధించిన ప్లకార్డులతో ప్రజలు హాజరయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించని విధంగా దివంగత ఎమ్మెల్యే సాయన్న అభివృద్ధి చేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు. మూడోసారి అధికారంలోకి వస్తే పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేలా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు. రూ.10వేల నుంచి రూ.16వేల వరకు రైతుబంధు పెంచుతారని, రూ.1,250 ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.400కే అందించేలా మ్యానిఫెస్టోలో పొందుపరిచామన్నారు.