పహాడీషరీఫ్, మార్చి 10: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మకమైన పహాడీషరీఫ్ దర్గా 757వ హజరత్ బాబా షర్ఫుద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కుల, మతాలకతీతంగా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు 15 వరకు జరగనున్నట్లు తెలిపారు. 12న నిజాం ట్రస్ట్ ఆధ్వర్యంలో గంధం ఊరేగింపు ,13న దీపాల అలంకరణ, ఖురాన్ పఠనం, 14న రాత్రి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆనవాయితీగా సాయంత్రం సర్కారీ గంధం తీస్తారు.
15న దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తలిపారు. పహాడీషరీఫ్ కొండపై ఉన్న హజరత్ బాబా షర్ఫుద్దీన్ దర్గాను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలాపూర్‌లో పూర్వం బాబా షర్ఫుద్దీన్ నివాసం ఉన్న ప్రాంతం వద్ద దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తుల మధ్య గంధం ఊరేగింపు ప్రారంభమైంది. కొత్తపేట, వెంకటాపూర్, బిస్మిల్లాకాలనీ, షాహీన్‌నగర్ మీదుగా జల్పల్లి కమాన్ ప్రాంతంలో ఉన్న షక్కర్ షా వలీ దర్గా వద్దకు చేరుకున్నారు.
అక్కడ ఫజర్ నమాజ్ నిర్వహించిన అనంతరం పహాడీషరీఫ్ దర్గాకు భారీ ర్యాలీ ప్రారంభమైంది. డప్పు వాయిద్యాల మధ్య యువకుల కేరింతలతో, ఆటపాటలతో పహాడీషరీఫ్ దర్గాకు 8 గంటల వరకు చేరుకున్నారు. బాబా షర్ఫుద్దీన్ మందిరానికి చేరుకొని పూజలు నిర్వహించి సందల్ సమర్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి దర్గాకు పూలు చాదర్ సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. దర్గాకు మ్యాట్, 10 టేబుల్ ఫ్యాన్‌లో అందజేశారు. మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య, పహాడీషరీఫ్, బాలాపూర్ సీఐలు కిరణ్‌కుమార్, భాస్కర్ పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు.