సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): సైబర్ సిటీలోనే అత్యంత ఖరీదైన పెట్రోల్ బంకులను కాంగ్రెస్ పెద్దలకు కట్టబెట్టేందుకు టీజీఐఐసీ ప్లాన్ వేసిందా..? నామమాత్రపు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి ‘ముఖ్య’నేత అనునయులకు అప్పగించేందుకు స్కెచ్ గీసిందా..? టీజీఐఐసీ వ్యవహారం ఈ అనుమానాలను నిజం చేసేలా ఉంది. నగరంలోని ప్రైమ్ ఏరియాలైన నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రెండు పెట్రోల్ పంపులను సర్వీస్ ప్రొవైడర్లకు కేటాయించేందుకు గత నెల 23న టీజీఐఐసీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ భాగస్వామ్యంతో రెండు పెట్రోల్ పంపులను నిర్వహించేందుకు ఆసక్తి, అనుభవం కలిగిన సర్వీస్ ప్రొవైడర్లు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది.
దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు విధించింది. కానీ.. సంబంధిత ఇండియన్ ఆయిల్ కంపెనీ మాత్రం ఆసక్తి కలిగిన అర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా కొంత మంది కాంగ్రెస్ పెద్దల అనుకూలమైన వారికి ఇస్తున్నట్లు తెలుస్తున్నది. అనుభవ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ పెద్దల బంధువులు, ముఖ్య నేతల అనుచరులకే ఇచ్చారని సమాచారం. ఆసక్తి కలిగిన ఇతర డీలర్లు సంప్రదిస్తే ఇండియన్ ఆయిల్ ప్రతినిధులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ జరపకుండా కొంత మంది కాంగ్రెస్ పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
నాలెడ్జ్ సిటీలోని ఐకియాకు ఎదురుగా ఉన్న పెట్రోల్ పంపు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లేదారిలో ఉన్న మరో పంపునకు ఆయిల్ సరఫరాదారుగా టీజీఐఐసీ ఇండియన్ ఆయిల్ కంపెనీకి అప్పగించింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు టెండర్లో పాల్గొనదలచే ఆసక్తి కలిగిన వారి అర్హతలను గుర్తించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు గడిచిన మూడేండ్ల నుంచి డీలర్‌గా కొనసాగుతూ అందుకు తగ్గట్లుగా ఆయిల్ విక్రయం చేసినవారిని అర్హులుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించి పలు విధాలుగా తనిఖీ చేసి అర్హత ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది.
కానీ ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇప్పటి దాకా అతి తక్కువ మందికే అర్హులుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. వారంతా కాంగ్రెస్ ముఖ్య నేతల బంధువులు, అనుచరులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారందరికీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తున్నది. కొద్ది మందికే అర్హత పత్రాలిచ్చి అత్యంత డిమాండ్ కలిగిన పెట్రోల్ పంపులను కాంగ్రెస్ నేతల బంధువుల కైవసం చేసే కుట్రలు జరుగుతున్నట్లు సమాచారం.