పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీఎస్ఆర్) ప్రభాకర్ దాస్
చర్లపల్లి, మార్చి 1: నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణకు సీఎస్ఆర్ కార్యక్రమంలో పది కోట్ల నిధులు కేటాయించామని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్(సీఎస్ఆర్) ప్రభాకర్ దాస్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని కేంద్ర ఎరువులు, పెట్రో రసాయనాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలాజీ (సీపెట్)లో కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్లాస్టిక్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, భోజన వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వివిధ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయా సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్సీ ప్రాజెక్ట్ అధికారి రాజు రమేశ్, సీపెట్ హెడ్, ఏఎస్ఐజే బాస్కో హెడ్ శ్రీనివాసులు, సీపెట్ అధికారులు కిరణ్ కుమార్, ఏకే రావు, మురహరి, మణికందన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.