సైదాబాద్, జూన్ 8: జూనియర్ సివిల్ జడ్జి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులంతా ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అయ్యడపు రవీందర్ రెడ్డి, సిటీ సివిల్‌కోర్టు జడ్జి సాయి కిరణ్ అన్నారు. రాపోలు రామలక్ష్మి – రాములు జ్ఞాపకార్థం హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ జూనియర్ సివిల్ జడ్జి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణ తరగతులు అందిస్తున్నారు. గడ్డి అన్నారం కల్యాణ్‌నగర్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి రవీందర్ రెడ్డి, సాయి కిరణ్‌లు ముఖ్య అతిథులుగా శనివారం విచ్చేసి శిక్షణ తరగతులను ప్రారంభించి, ఆయన మాట్లాడారు.
కఠోర శ్రమ నిర్దిష్ట లక్ష్యం, పట్టుదలతో పోటీ పరీక్షలు రాస్తే విజయం సాధించటం ఖాయమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్షలకు తక్కువ రోజులే ఉన్నాయని అందుకు అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటువంటి అవకాశాలు ఎంతోగాను దోహదపడుతాయన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ మాట్లాడుతూ, జూనియర్ సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు హాజరయ్యే వెనుకబడిన అభ్యర్థులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో ఉచిత శిక్షణ తరగతులను అనేక మంది నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు భార్గవ్, సునీల్ గౌడ్, రంగయ్య, శంకర్, విష్ణు, శ్రీధర్, ప్రభాకర్, కొమరయ్య పాల్గొని ప్రసంగించారు.