సాహితీ కుసుమం.. గుభాళించింది. అక్షరం అలలై ఎగిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం
గ్రేటర్‌వ్యాప్తంగా నిర్వహించిన సాహిత్య దినోత్సవం తీయని వేడుకగా, వైభవోపేతంగా సాగింది. తెలంగాణ సాహిత్య విశిష్టతను మరోసారి గొప్పగా చాటింది. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. కవి సమ్మేళనాలు, సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కొంతమంది కవులు తమ కవితలతో తెలంగాణ అభివృద్ధికి నీరాజనాలు పలికారు. ‘దశాబ్దిలో తెలంగాణ ధరణిపై వెలిగింది.. పదేండ్లలో తెలంగాణ ప్రగతి బాట పట్టింది’ అని తెలంగాణ సాధించిన ప్రగతిని కవిత రూపంలో అందంగా ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం-బహుభాషా కవి సమ్మేళనం’లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆ కలాలకు ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు…ఇవే కథావస్తువులు కన్నీరు కార్చేవి. గుక్కెడు నీళ్ల కోసం పరితపించేవి.. బీడు భూములు, బోరు బావులను చూసి దుఖించేవి. ఇదంతా తెలంగాణ రాకముందు ముచ్చట. స్వరాష్ట్రంలో అవే కలాలు అభివృద్ధిని కళ్లారా చూస్తున్నాయి. తాము కలలుగన్న తెలంగాణ కండ్ల ముందు సాక్షాత్కరిస్తుండడంతో పరవశంతో పొంగిపోతున్నాయి. ఉబికొస్తున్న కవిత్వంతో గళమెత్తుతున్నాయి. అక్షరానికి గౌరవం చూసి ఆనందభాష్పాలు కారుస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతి వేదికగా తెలంగాణ సాహితీ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన బహుభాషా కవి సమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఉర్దూ కవులు పాల్గొని తమ రచనలను వినిపించారు. ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రభుత్వం శాలువా, మెమొంటో, నగదు ప్రోత్సాహంతో సత్కరించింది. పద్య, వచన విభాగాల్లో వేలేటి మృత్యుంజయ శర్మ, అయాచితం నటేశ్వర శర్మ, కంది శంకరయ్య, వెల్దండ సత్యనారాయణ, మలుగు అంజయ్య, తల్లోజు యాదవా చార్య, బండకాడి అంజయ్య గౌడ్, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, రూప్‌కుమార్, నెల్లుట్ల రమాదేవి, నిరంజన్, సుబ్బయ్య, ఆశారాజు, ప్రొఫెసర్ రామాచంద్రమౌళి, నీరజ, సంధ్య, అష్టావధాని అవుసుల భాను ప్రకాశ్, సలావుద్దిన్, దత్తాత్రేయ శర్మ తదితరులను సత్కరించారు.
– సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ)