హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ కే ధర్మాపై వేటు పడింది. ఈఎన్సీ జనరల్‌కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాచుపల్లిలో ఒక మాల్ నిర్మాణానికి ఎన్వోసీ మంజూరు చేసేందుకు రూ.కోటిన్నర డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన సంగారెడ్డి సీఈగా తప్పించినట్లు తెలుస్తున్నది.
అదేవిధంగా ధర్మా హైదరాబాద్ సీఈగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాంతో హైదరాబాద్ సీఈ బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇరిగేషన్ జనరల్ ఈఎన్సీకి అటాచ్ చేసింది. ఇదిలావుంటే గ్రేటర్ హైదరాబాద్‌లో పనిచేసిన సందర్భంలోనూ సీఈ ధర్మాపై ఆరోపణలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోనూ అదే పరిస్థితి కొనసాగింది.
సాధారణంగా చెరువులు, నాలాల సమీపంలో భవనాల నిర్మాణాలకు ఎన్వోసీ తీసుకోవడం తప్పనిసరి. ఇదే అదనుగా తీసుకున్న సీఈ ధర్మా.. భారీగా వసూళ్ల దందాకు తెరలేపినట్లు సమాచారం. ఇటీవలే సంగారెడ్డి సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఈఈని పట్టుకున్నారు.