చిక్కడపల్లి, మే 18: ప్రభుత్వం వెంటనే తెలంగాణ సినిమా పాలసీని ప్రకటించాలి. తెలంగాణ సినిమాను ప్రోత్సహించేలా ఆ పాలసీ ఉండాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ సినిమా రంగం: అభివృద్ధి-అవరోధాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పసునూరి రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ మావేశంలో సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ దర్శకులు, రచయితలు, ప్రజా ఇనుముల ప్రేమారాజ్, సయ్యద్ రఫీ, ప్రవీన్ చందర్, అశోక్ కుమార్, చల్లా శ్రీనివాస్, అక్షర కుమార్, రమేష్ కిషన్ గౌడ్, తెలంగాణ సినిమా వేదిక గౌరవ సలహాదారులు ప్రఫుల్ రామ్ రెడ్డి, కన్వీనర్ బైరాగి మోహన్ తదితరులు హాజరై ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నా నేటికీ తెలంగాణ సినిమా రంగం తీవ్ర వివక్షతకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమా నిర్మాణానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించాలి. తెలంగాణ సినిమాకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. ప్రత్యామ్నయ సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.