సుల్తాన్‌బజార్, అక్టోబర్ 29: అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవడం అభినందనీయమని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ అర్చక కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ, కార్యదర్శి సీహెచ్.బద్రీనాథ్‌లు అన్నారు. శుక్రవారం బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అడిషనల్ కమిషనర్ జ్యోతి కురాకుల, విజిలెన్స్ అధికారి కృష్ణవేణి, రీజినల్ జాయింట్ కమిషనర్ ఎం.రామకృష్ణారావుతో కలిసి అర్చక, ఉద్యోగులు సమావేశమయ్యారు. అనంతరం అర్చక, ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలన్న అంశంపై అధికారులు సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. వివిధ జిల్లాలో పని చేస్తున్న 1000 మంది అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందించేలా అధికారులు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.