మాదాపూర్, జులై 12 : తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 గ్రాండ్ ఫినాలేను ఈ నెల 15న గండిపేటలోని సవాయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పరిశ్రమలో ఉన్న అసాధారణ ప్రతిభ, వినూత్న, అంకితభావాన్ని గుర్తించే వేడుకగా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ పోస్టర్‌ను మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు బాలరాం బాబు, జనరల్ సెక్రటరీ రవి బూరా, ట్రెజరర్ తౌఫిక్ ముహమ్మద్ ఖాన్, కన్వీనర్లు, కో-కన్వీనర్ల తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీసీఈఐ అధ్యక్షుడు బాలరాం బాబు, టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కన్వీనర్ రమేశ్ కే ముప్పన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం అవార్డ్స్‌కు 400కిపైగా నామినేషన్లు రావడం జరిగిందని, వీటిలో ‘పెర్ల్ ఆఫ్ హైదరాబాద్’ కేటగిరీలో 80కు పైగా విభాగాలు, ‘జెమ్ ఆఫ్ ఇండియా’ కేటగిరీలో 15 విభాగాలు ఉన్నట్లు తెలిపారు. భారత ఈవెంట్స్ రంగం ఎంతో వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. అవార్డ్స్ ఎంపిక ప్రక్రియలో భాగంగా జులై 6 న హైటెక్స్‌లో నిర్వహించిన షోకేస్ ఈవెంట్లో భాగంగా నామినీలు తమ జ్యూరీ సభ్యుల ఎదుట ప్రదర్శించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కో-కన్వీనర్లు సుధాకర్ యరబాదీ, హరీష్ రెడ్డి, వందన రాజా (టైటిల్ స్పాన్సర్), శుభంకర్ మహారథీ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.