ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్ బండ్ అందాలు చూసేందుకు ఆదివారం సాయంత్రం స్థానికులకు అవకాశం ఇవ్వాలని నగరవాసి ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌ను కోరగా.. వెంటనే స్పందించిన ఆయన ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వెహికల్ ఫ్రీ జోన్‌గా మారుస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. తాజాగా ట్రాఫిక్ మళ్లింపు, ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగు తల్లి, ఇక్బాల్మినార్ వైపు మళ్లిస్తారు.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ఈ రూట్లో వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
కర్బల మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వాహనాల అనుమతి లేదు. ఈ రూట్లో వచ్చే వాహనాలను షెలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ ఆలయం నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది.
ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలను, ఓల్డ్ సెక్రటేరియట్ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపునకు మళ్లిస్తారు.