ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం నగరవాసులు సందడి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అన్ని శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజున నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉల్లాసంగా గడిపేందుకు ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌ను వేదిక చేసింది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పైకి ట్రాఫిక్‌ను నిలిపివేస్తూ.. కేవలం సందర్శకులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గత ఆదివారం ట్యాంక్‌బండ్‌పైకి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతించారు. దీంతో సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు సైతం తమ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
రెండో ఆదివారం కూడా సాయంత్రం 5 గంటలకే ట్యాంక్‌బండ్‌పైకి భారీ సంఖ్యలో సందర్శకులు చేరుకున్నారు. ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసులు 5 గంటల నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల రాకను నిలిపివేశారు. కొద్ది సేపటిలోనే సందర్శకులు పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. రెండో ఆదివారం నగరవాసుల నుంచి భారీ స్పందన ఉందని ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ తెలిపారు. వర్ష సూచన ఉండటంతో సందర్శకుల తాకిడి తక్కువగానే ఉంటుందని అధికారులు భావించారు. సాయంత్రం వర్షం లేకపోవడంతో సందర్శకులు భారీగానే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ట్యాంక్‌బండ్‌పైకి కుటుంబ సమేతంగా వచ్చిన నగరవాసులు కోలాహలం చేశారు. విశాలమైన ట్యాంక్‌బండ్‌పై ఇరువైపులా ఉన్న అందాలను వీక్షిస్తూ సంతోషంగా గడిపారు. పిల్లలు ట్యాంక్‌బండ్‌పై ఎంజాయ్ చేశారు. ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తమవారితో ఆనందాన్ని పంచుకున్నారు.
సందర్శకుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతవారం దాదాపు 20 వేల మంది సందర్శకులు ట్యాంక్‌బండ్‌కు రాగా.., ఈ ఆదివారం 30వేల మందికి పైగా వచ్చారని అధికారులు తెలిపారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వచ్చిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఆహ్లాదాన్ని ఆస్వాదించారు. సందర్శకులతో ముచ్చటించారు. ఆదివారం ట్యాంక్‌బండ్‌పై వాహనాలు అనుమతించకుండా.. ప్రజలను మాత్రమే అనుమతించడంతో ఎలాంటి అనుభూతి పొందుతున్నారు.. అంటూ సందర్శకులను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్‌బండ్‌కు ఇలా రావడం పిక్నిక్కు వచ్చినట్టుగా ఉందని డిప్యూటీ మేయర్ సంతోషం వ్యక్తం చేశారు.