హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 17 : ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్యర్యంలో శనివారం హిమాయత్ నగర్ మఖ్దుం భవన్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం ఆనాడు సాయుధ పోరాటం జరిగిందని, ఈ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో పాత్రలేని ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు చరిత్రను వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మతోన్మాద శక్తుల కుట్రలను భగ్నం చేసేందుకు విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.శివరామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, నాయకులు రెహ్మన్, కాసోజు నాగజ్యోతి, గ్యార నరేశ్, వెంకటేశ్, నెల్లి సత్య, హరికృష్ణ, శివ, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.