
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతికి పండగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు టీఎస్ ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని సీఎండీ సజ్జనార్ సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా 2,700 బస్సులు నడుపుతున్నామని, అదనపు చార్జీలు తీసుకోవడం లేదని చెప్పారు. పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్లాట్‌ఫాంపై ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది? వంటివి పరిశీలించేందుకు బుధవారం ఎంజీబీఎస్‌ను సందర్శంచారు. అధికారులు బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సదుపాయాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ అభివృద్ధి, ఏర్పాట్లపై వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ఉద్యోగినులకు బహుమతులు అందజేశారు. కళాబృందాల ప్రదర్శనను వీక్షించారు. వారికి కేటాయించిన వాహనాన్ని, మైక్‌సెట్‌ను ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమయ్యారు. సంస్థకు ప్రయాణికులే దేవుళ్లు అని, వారి ఆదరణతోనే ఆర్టీసీ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్, కరీంనగర్ ఈడీ ముణికుమార్, హైదరాబాద్ రీజియన్ మేనేజర్ వెంకన్న, రంగారెడ్డి రీజియర్ మేనేజర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.