సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీ హబ్…. స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్… స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన వాతావరణం (స్టార్టప్ ఎకో సిస్టం) కల్పించడంతో దేశంలోనే టీ హబ్ ప్రథమ స్థానంలో ఉంది. కొత్త ఆలోచనలతో వస్తే… సరికొత్త ఆవిష్కరణలతో బయటికి పంపేలా ఏడాది పొడువునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఒకవైపు కరోనా మహమ్మారి వెంటాడుతున్నా… స్టార్టప్‌లను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రణాళికాబద్ధం గా పని చేస్తోంది. ఫలితంగా ఏడా ది కాలంలోనే 6 అంతర్జాతీయ,7 జాతీయ కార్పొరేట్ కంపెనీలతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
2021లో టీ హబ్ కార్యకలాపాలు….
టీ హబ్‌లో 146కి పైగా స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరింది. ల్యాబ్స్ 32, టీ ట్రైబ్, ఏఐసీ, టీ-ఏంజిల్, లాట్రోబ్ వంటి ఇంక్యుబేటర్లు స్టార్టప్‌లకు పని చేసేలా టీ హబ్ వేదికగా నిలిచింది.
నెట్ వర్కింగ్ కార్యకలాపాలు, బయటి సంస్థల నుంచి సుమా రు రూ.14 కోట్ల ఫండింగ్ టీ హబ్‌లోని స్టార్టప్‌లకు సమకూరింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా నుంచి సీడ్ ఫండ్ ద్వారా గ్రాంట్ రూపంలో రూ.5 కోట్లు వచ్చాయి.
7 అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతీయ కంపెనీలు, ప్రభుత్వ శాఖలు టీ హబ్‌తో కలిసి కార్పొరేట్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో మెటా, జేకే టెక్, హెచ్‌సీఎల్, మారుతి సుజుకీ, సిటీ, పెప్ ల్యాబ్స్, ఐడీక్స్ (ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్) వంటివి ఉన్నాయి.
ఈ ఏడాదిలో 6 అంతర్జాతీయ సంస్థలు టీ హబ్‌తో భాగస్వామ్యమై స్టార్టప్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో లా ట్రోబ్ యూనివర్సిటీ, కాటపుల్ట్ డిజిటల్, యుకే ఎఫ్సీడీవో, స్టార్టప్ జినోమ్, రెడ్ బెర్రీ, డీఐటీ వంటి సంస్థలు ఉన్నాయి.
18కి పైగా కంపెనీలు టీ హబ్‌లో ఉన్న స్టార్టప్ కంపెనీలకు సర్వీసు ప్రొవైడర్లుగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పేటీఎం, ఆర్బీఎల్ బ్యాంకు, మైరో, ఫైర్ ప్లయిస్, క్యాష్ ఫ్రీ, లంచ్ క్లబ్‌లు ఉన్నాయి.
టీ హబ్‌లో 2021లో నిర్వహించిన 33 కార్యక్రమాలకు 2235మందికి పైగా ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహకులు హజరు కాగా, 95 మంది నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు.
టీ హబ్‌లో నిర్వహించిన కొవిడ్-19
వ్యాక్సినేషన్ ద్వారా 234 మందికి టీకాలను
ఇప్పించారు.
టీ హబ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన టీ-ట్రైబ్ కార్యక్రమం ద్వారా 1008 మంది విద్యార్థులు లబ్ధిపొందారు.