సిటీబ్యూరో, జూలై 31 ( నమస్తే తెలంగాణ ) :మొన్న విద్యార్థుల బస్పాస్, టీ 24 టికెట్ ధరలు.. ఇటీవల ఆర్టీఏ సర్వీస్ చార్జీలను పెంచి ప్రజలపై అకస్మాత్తుగా భారం మోపిన రేవంత్ సర్కార్ అంతే గుట్టు చప్పుడు కాకుండా పుష్పక్ బస్సుల టికెట్ ధరలను సైతం పెంచి ప్రయాణికుల నడ్డి విరిచింది. విమానాశ్రయం వెళ్లే పుష్పక్ బస్సుల టికెట్ ధరలను గతంలో రూ. 300 ఉంటే రూ. 50 పెంచి రూ. 350 చేసింది. ప్రయాణికులు రవాణా శాఖ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రవి అనే ప్రయాణికుడు జేబీఎస్ నుంచి విమానాశ్రయానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ ధర రూ. 850 సూచించింది. అందులో నలుగురు వ్యక్తులు ప్రయాణం చేసే వీలుంది. కానీ అదే ఆర్టీసీ పుష్పక్ బస్సులో ప్రయాణం చేయాలంటే ఒక్కరికే రూ.350 టికెట్ ధర ఉంది. అందులోనూ క్యాబ్ ఇంటి నుంచి పికప్ చేసుకొని మళ్లీ గమ్యస్థానంలో చేర్చుతుంది.
టికెట్ ధరలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాల్సిన ఆర్టీసీ అదనపు ఆదాయం వసూలే లక్ష్యంగా ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో వివిధ రూట్ల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బస్సులో లక్ష మంది ప్రయాణికులు రోజుకు రాకపోకలు సాగిస్తుంటారు.
విమానాశ్రయం నుంచి వచ్చే కొన్ని పుష్పక్ బస్సుల్లో రూ. 450 టికెట్ ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఒక విధానమంటూ లేని టికెట్ ధరలతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్.. మరోవైపు ప్రయాణికులపై భారం మోపుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.