సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ) : పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలోనే కేబీఆర్ ప్రాజెక్టు రివర్స్ గేర్‌లోకి మళ్లింది. టెండర్ల దశలోనే అధికారులు వెనక్కి తగ్గారు. ఇందుకు భూ సేకరణ ప్రధాన కారణమని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)లో భాగంగా పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో రూ. 1090 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులకు గత నెలలో జరిగిన ప్రజా పాలన ఏడాది విజయోత్సవ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెండర్ల దశను ముగించి అర్హత గల ఏజెన్సీతో పనులు ప్రారంభించాల్సిన అధికారులు భూసేకరణపై స్పష్టత వచ్చాకనే టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ విభాగం నిర్ణయించింది. దీంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టసాధ్యమేనన్న చర్చ లేకపోలేదు.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రద్దీ నియంత్రణ, వాహనదారులు తేలిగ్గా ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల్లో అత్యంత క్లిష్టమైనది భూ సేకరణ ప్రక్రియ..అయితే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేకుండానే హడావుడి చేసి ప్రస్తుతం అటకెక్కించారు. ప్రస్తుతం పాత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఆర్డీపీ) పరిగణనలోకి తీసుకుని కొత్త ఆర్డీపీ ప్లాన్ సిద్ధం చేశారు. గత ఆర్డీపీలో దాదాపుగా 86 నివాసాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ నివాసాల నుంచి ఆస్తుల స్వాధీనం అధికారులకు సవాల్‌గా మారింది.
బంజారాహిల్స్ రోడ్ నం. 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా గతంలోనే పలు భవనాలను మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం .92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో ఉన్న హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు. సుమారుగా తన ప్లాట్‌లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితర ఇండ్లకు కూడా మార్కింగ్ వేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 12 విరంచి ఆసుపత్రి నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తులు సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. 86 నివాసాలకు మార్కింగ్ చేశారు.
కేబీఆర్ పార్కు చుట్టూ అగ్రసేన్, ఫిలింనగర్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం ఇలా ఆరు జంక్షన్లు ఉన్నాయి. ఈ ఆరు జంక్షన్లలో 8 స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణం జరగనుంది. జూబ్లీహిల్స్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెండు చొప్పున నాలుగు స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగతా నాలుగు జంక్షన్ల వద్ద ఒక్కో స్టిల్ బ్రిడ్జి, ఆరు జంక్షన్ల వద్ద ఒక్కొక్కటి చొప్పున ఆరు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి రోడ్డు నెంబరు. 45 వైపు వచ్చే ఫ్లై ఓవర్‌పై భాగంలో రెండు లేన్లతో రానుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ నం. 36 వైపు నాలుగు లేన్ల కింద నుంచి వెళ్లనుంది. ఈ నిర్మాణాలతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని గతంలో పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించాయి. ప్రస్తుతం సైతం పర్యావరణ వేత్తలు కొందరు ఎన్జీటీకి వెళ్లే అస్కారం కూడా లేకపోలేదు.