సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పశ్చిమ బెంగాల్ కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.5లక్షల విలువ చేసే 66గ్రాముల బ్రౌన్ షుగర్(హెరాయిన్)ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ మాల్ద ప్రాంతానికి చెందిన నూర్ అక్బర్, అజిత్ మోహిన్ ఉపాధి పేరుతో నగరానికి వచ్చి ఖాజాగూడ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న డీటీఎఫ్ పోలీసులునిందితులిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 66గ్రాముల హెరాయిన్, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శేరీలింగంపల్లిలో..
శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరుకు చెందిన సన్డ్ శేరీలింగంపల్లిలోని గుత్తా తేజ కృష్ణకు ఎండీఎం విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి, 5.14గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తెలిపారు.
మల్కాజిగిరిలో….
మలాజిగిరికి చెందిన మహేష్ రెడ్డి స్థానికంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతుండగా.. ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 510 గ్రాముల గంజాయిని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బస్సులో గంజాయి పట్టివేత..
నాగపూర్‌నుంచి బస్సులో గంజాయి రవాణ జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు నాగపూర్ నుంచి నగరానికి ప్రయాణిస్తున్న బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఘట్కేసర్లో నాగపూర్ నుంచి వచ్చిన పైవేటు బస్సులో ప్రభురాజ్ వద్ద 1.227 కేజీల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అరెస్టు చేశారు.
11.5 కేజీల గంజాయి స్వాధీనం
ఆబ్కారీ పోలీసులు ఒక కేసుకు సంబంధించి జరిపిన దాడుల్లో ముగ్గురు నిందితులు దొరికారు. వివరాలు.. సరూర్‌నగర్ ప్రాంతంలోని చైతన్యపురిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న భూక్య శ్రీకాంత్‌ను ఈనెల 6న ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద 340 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా గంజాయి ఎకడి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించగా స్థానికంగా ఉండే అబ్బాస్ అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
ఈ మేరకు ఆబ్కారీ పోలీసులు అబ్బాస్ నివాసంపై దాడులు జరపగా అతడి వద్ద 850 గ్రాముల గంజాయి లభించింది. అబ్బాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను నడిమింటి మమత అనే మహిళ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. అబ్బాస్ ఇచ్చిన సమాచారంతో మమత ఇంటిపై దాడులు నిర్వహించగా ఆమె నివాసంలో 10.693 కేజీల గంజాయి లభించింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.6లక్షల విలువ చేసే 11.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.