నగరవాసులకు దూర భారం, ట్రాఫిక్ తిప్పల నుంచి విముక్తి కల్పించేందుకు సిటీ నలుమూలలా ఇప్పటికే పెద్ద ఎత్తున కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్లు, లింకు రోడ్లు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ప్రయాణం కష్టంగా మారిన కొన్ని చోట్ల స్టీల్ వంతెనలు కూడా నిర్మిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో అనేక రూపాల్లో మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా నగరంలో ఐదో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కూడా ముమ్మరంగా సాగుతున్నది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 51లో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అపోలో ఆస్పత్రికి వెళ్లే రోడ్డులో రెండో కుడివైపున రోడ్డు నంబర్ 70 ఉంటుంది.
అక్కడి నుంచి 1.5 కి.మి లోపలికి ప్రయాణిస్తే రోడ్డు నంబర్ 51 చేరుకుంటాం. బాగా గుట్టలున్న ప్రాంతం కావడంతో ఈ రెండు రోడ్లు కలిసే చోట రహదారి బాగా లోతుగా ఉంది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణం కష్టతరంగా మారింది. కాగా, రోడ్డు నంబర్ 51 నుంచి రాయదుర్గం వరకు అనుసంధాన రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. పాత ముంబై హైవే నుంచి ఇలా నగరంలోకి షార్ట్కట్ దారి ఏర్పాటు చేయడంతో ఇటీవల బాగా రద్దీ బాగా పెరిగింది. అయితే సైలెంట్ వ్యాలీ కాలనీ వద్ద రహదారి ఓ పెద్ద కొండ నుంచి దిగినట్టుగా లోతుకు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో వాహనదారులు అక్కడ ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు దిగువన ఉన్న ప్రదేశం వరకు అటూ ఇటూ సులువుగా వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా హెచ్ఆర్డీసీఎల్ ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నది. రూ.23 కోట్ల అంచనా వ్యయంతో 290 మీటర్ల మేర స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.