రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. అనే పాటతో అందరి హృదయాలను తడిమిన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో నగరం శోకసంద్రమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు గుర్రంగూడలో సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయిచంద్ పార్థివదేహాన్ని చూసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అశ్రునయనాల మధ్య సాయిచంద్ అంత్యక్రియలు వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌లో గురువారం సాయంత్రం ముగిశాయి.
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సాయిచంద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలో ఫామ్‌హౌస్ ఉంది. బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయిచంద్ మృతి విషయం తెలిసిన సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర మంత్రులు సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, కంటతడి పెట్టారు. సాయిచంద్ మరణవార్త విని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కళాకారులు గుర్రంగూడలోని ఆయన స్వగృహానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వనస్థలిపురం సాహెబ్ నగర్‌లోని శ్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. గుర్రంగూడ నుంచి సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర ముందు కళాకారులు ‘సాయిచంద్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ పాటలతో ఆయన్ని గుర్తు చేసుకున్నారు.
తన గాత్రంతో రాతిగుండెలను కదిలించిన అద్భుత కళాకారుడు సాయిచంద్. ఉద్యమంలో సహచరుడిగా, సోదరుడిగా కలిసి పని చేశారు. ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిలో ధైర్యం నింపడానికి తన గాత్రంతో ఊపిరినిచ్చిన గాయకుడు. అందరికీ ఆప్తుడైన సాయిచంద్, ఇంతచిన్నవయస్సులో మరణం అందరినీ కలిచివేసింది. అందరికీ గుండెలను పిండేసే విధంగా తీవ్రమైన విఘాతంగా కలిగింది.
– ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
సాయిచంద్ మరణ వార్త కలిచి వేసింది. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న.
– మంత్రి గంగుల కమలాకర్
గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం కలిచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా. తెలంగాణ సమాజం గొప్ప నాయకుడిని కోల్పోయింది.
– మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి
ఉద్యమానికి ఆయువుపట్టులా సాయిచంద్ స్వరం మార్మోగింది. పునర్నిర్మాణంలో సైతం తన గొంతును జతకలిపి ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. సాయిచంద్ మరణం తెలంగాణకు తీరనిలోటు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ మలిదశ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన అందించిన సేవలు అమోఘం. యువ గాయకుడి గొంతు అకాలంగా మూగపోవడం నన్ను కలిచివేసింది. సాయిచందు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నా.
– ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్రం ఓ గొప్ప గాయకుడిని, భవిష్యత్ నాయకుడిని కోల్పోయింది. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ విశేషమైన పాత్ర పోషించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో సాయి పోషించిన పాత్ర విస్మరించలేనిది. సాయి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబీకులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాయిచంద్ లేడని ఊహించడానికే బాధగా ఉన్నది. ఉద్యమంలో, పార్టీలో నిజాయితీ గల సైనికుడిగా కష్టాన్ని నమ్ముకుని పని చేశాడు. ఆయన ఆకస్మిక మృతి తెలంగాణ రాష్ర్టానికి, పార్టీకి లేని తీరనిలోటు.
– ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ పాత్ర కీలకం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సాయిచంద్ కుటుంబసభ్యులను భగవంతుడు మనోధైర్యం ప్రసాధించాలి.
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాయిచంద్ మరణ వార్త యావత్ తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రతిపౌరుడిని కలిచివేస్తున్నది. తెలంగాణ ఉద్యమ పాటలతోపాటు సాంఘిక సమస్యలపై కూడా అనేక పాటలు రాశారు. కేసీఆర్ గారి మాటలు ప్రజల్లోకి ఎంతలోతుగా దూసుకెళ్లాయో.. సాయిచంద్ పాటలు యావత్ తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచాయి.
– బి.వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
తమ్ముడు సాయిచంద్ అకాల మరణం ఎంతో బాధకు గురిచేసింది. ఆయన తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్పపాత్ర పోషించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఉద్యమంలో సాయిచంద్ పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. భౌతికంగా మన మధ్యలేకున్నా పాట రూపంలో అందరి గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
– ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి
చేకూరాలి. – విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన ఉద్యమ గానంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు. సాయిచంద్ హఠాన్మరణం కలిచివేసింది. భవిష్యత్ తెలంగాణకు తీరని లోటు.
– డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం ఎంతో కలిచి వేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. – ఎమ్మెల్సీ కవిత
సాయిచంద్ మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. కవి, గాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పేదలకు మేలు జరగాలని తపించే ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడిని తెలంగాణ కోల్పోయింది. సాయిచంద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం.
– వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కవి, ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి తీరని లోటు. ఉద్యమంలో సాయిచంద్ పాత్ర మరువలేనిది. ఉద్యమ ఆకాంక్షను ప్రజాక్షేత్రానికి తెలియజెప్పిన గొప్ప ఉద్యమకారుడు. సాయిచంద్ పాట ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.
– ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలొద్దని భరోసానిచ్చి, అతి చిన్నవయస్సులోనే లక్షలాది మందిని ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి కదిలించారు. ఆయన మరణించాడంటే నమ్మశక్యంగా లేదు. తెలుగు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుంటారు.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతి తీరనిలోటు. మంచి గాయకున్ని, నాయకున్ని పోగొట్టుకున్నాం. ఆయన లోటు పూడ్చలేం. సీఎం కేసీఆర్ సభలు ఎక్కడ ఉన్న అక్కడ ఆయన ప్రభుత్వ పథకాలను పాటల రూపంలో ప్రజలకు కండ్లకు కట్టె విదంగా పాడేవారు. – విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Kcr