మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 2 : విద్యనందించడం వ్యాపారం కాదు బాధ్యత అని రాష్ట్ర బాల ల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీత దయాకర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల జరిగిన చిన్నారిపై ఆయమ్మ చేయిచేసుకున్న ఘటన పునరావృతం కాకుండా ఉపాధ్యాయులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూ చించారు.
పోక్సో చట్టంపై అవగాహన వంటి అంశాలపై ఫైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేశామని, బాలల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల భద్రతకు మొదటి ప్రా ధాన్యత ఇవ్వాలని, పాఠశాలలో వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఇటువంటి ఘటనలు తలెత్తకుండా పాఠశాల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, కమిషన్ సభ్యులు చందన, సరిత, డీఈఓ విజయకుమారి, జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి కిషన్, ప్రైవేట్ పాఠశాలల యాజమానులు పాల్గొన్నారు.