సిటీబ్యూరో, మే11, (నమస్తే తెలంగాణ): స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్టార్ హెల్త్‌కేర్ క్వాలిటీ కాంక్లేవ్ 2025’ విజయవంతమైంది. వైద్య రంగంలోని ప్రముఖులు, నిపుణులు, నిర్వహణాధికారులు, నాణ్యత నిబంధనలు పాటించే వారందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. ‘నాణ్యత అనేది ఒక్కరోజులో సాధించే విషయం కాదు అది పైస్థాయి నాయకుల దృష్టితో ప్రారంభమై, ప్రతిరోజు కొనసాగాలి. నాణ్యత మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఆసుపత్రులకు లాభం కేవలం ఆర్థికంగా కాదు రోగుల విశ్వాసం, సంస్థ విలువ అన్నింట్లో కనిపిస్తుంది.
నాణ్యతతో కూడిన వైద్యం మరియు ఆర్థికంగా బలమైన వ్యవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకం కావు. రెండూ కలిసి ఎదగాలి. రోగులు కేవలం సేవ పొందేవారే కాదు.ఆరోగ్య నిర్ణయాల్లో భాగస్వాములవుతారు. పాత విధానాలను వదిలి ప్రామాణిక నిబంధనల్ని అనుసరించాలని’ సూచించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో అత్యవసర విభాగంలో ఉపయోగించాల్సిన 50 ప్రామాణిక ప్రోటోకాల్స్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్‌పీఐ, ఎన్బీఏఐ వ్యవస్థాపకులు డాక్టర్ అలెగ్జాండర్, స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.గోపిచంద్ మన్నం, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ కట్టా, స్టార్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.రమేష్ గుడపాటి తదితరులు పాల్గొన్నారు.