ఐటీ కారిడార్‌లో భద్రతే మా లక్ష్యమన్నారు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) సెక్రటరీ జనరల్ రమేశ్ కాజా. తాను అనేక దేశాల్లో పర్యటించానని.. ఐటీ కారిడార్‌లో భద్రత కోసం పనిచేసే ఎస్సీఎస్సీ వంటి సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. ‘ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం 18 ‘షీ షటిల్’ బస్సులను సంస్థ ద్వారా నడుపుతున్నాం. ప్రతినెల 1.80 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
‘షీ సేఫ్’ యాప్ ఏర్పాటు చేసి మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. ఐటీ కారిడార్‌లో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం’.. అని అన్నారు. ఐటీ కారిడార్‌లో పౌరులు స్వేచ్ఛగా జీవించడం, కార్యకలాపాలు, వ్యాపారాలు చేసుకోవడం కోసం కృషి చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ‘నమస్తే ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో భద్రతే తమ లక్ష్యమని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) సెక్రటరీ జనరల్ రమేశ్ కాజా స్పష్టం చేశారు. తాను అనేక దేశాల్లో పర్యటించానని.. ఐటీ కారిడార్‌లో భద్రత కోసం పనిచేసే ఎస్సీఎస్సీ లాంటి సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు. ఐటీ కారిడార్‌లో పౌరులు స్వేచ్ఛగా జీవించడం, కార్యకలాపాలు, వ్యాపారాలు చేసుకోవడం కోసం కృషి చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్‌ను ఐటీ సంస్థలకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వివరించారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
నమస్తే తెలంగాణ: సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నేపథ్యం, ముఖ్య ఉద్దేశం ఏమిటి?
రమేశ్ కాజా: సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 18 ఏండ్ల క్రితం 2006లో ఏర్పడింది. లాభాపేక్ష లేని ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పౌరుల భద్రత. ఐటీ కంపెనీల్లో పనిచేసే సిబ్బంది భద్రత, కంపెనీల్లో ఉగ్ర దాడులను అడ్డుకోవడం, విధ్వంసకర కార్యకలాపాల కోసం డేటా చోరీని నివారించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
నమస్తే తెలంగాణ: హైదరాబాద్, సైబరాబాద్‌ను ఐటీ సంస్థలకు గమ్యస్థానంగా నిలిపేందుకు మీరు రూపొందించిన ప్రణాళికలు ఏమిటి?
రమేశ్ కాజా: తెలంగాణ పోలీసు విభాగం, ఐటీ కంపెనీల ప్రతినిధుల సహకారంతో ఎస్సీఎస్సీ ఆరు అంశాలపై ప్రధానంగా పనిచేస్తుంది. పౌరుల వ్యక్తిగత భద్రత, మహిళలు/చిన్నారులు, యువత, ట్రాఫిక్- రోడ్డు, సైబర్, ఆరోగ్య భద్రత సంస్థ లక్ష్యం. సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ సంస్థకు చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉంటారు. తర్వాత సెక్రటరీ జనరల్, కన్వీనర్లుగా డీసీపీలు, సంఘ సేవ చేయాలనుకునే ఐటీ సంస్థల హెడ్లు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు.
నమస్తే తెలంగాణ: సైబరాబాద్‌లో ఉద్యోగుల భద్రత కోసం సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి?
రమేశ్ కాజా: ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం 18 ‘షీ షటిల్’ బస్సులను సంస్థ ద్వారా నడుపుతున్నాం. ప్రతినెల 1.80 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ఉద్యోగులు వసతి పొందుతున్న 1,200కు పైగా హాస్టళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ఐటీ సంస్థల్లో 950 మంది వరకు మార్గదర్శక్, సంఘమిత్రలను నియమించాం.
ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే ఈ ప్రతినిధులు పోలీసుల సాయంతో వారిపై చర్యలు తీసుకునేలా చేస్తారు. గృహ హింసకు గురైన ఉద్యోగినులకు కూడా పోలీసులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తారు. ‘షీ సేఫ్’ యాప్ ఏర్పాటు చేసి మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. 5 వేల మందికి పైగా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. వివిధ ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌లో పనిచేసేందుకు తమ పిల్లలను తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా పంపేందుకు వీలుగా హాస్టళ్లకు సేఫ్టీ రేటింగ్స్ ఇస్తున్నాం.
నమస్తే తెలంగాణ: రోడ్డు, ట్రాఫిక్ సేఫ్టీ ఫోరమ్ ఎలా పని చేస్తుంది?
రమేశ్ కాజా: ఎస్సీఎస్సీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌గా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 100కు పైగా ట్రాఫిక్ మార్షల్స్‌ను నియమించాం. ఈ చలాన్లలో ఏఐ కెమెరాలు, పౌరులకు ట్రాఫిక్ అలర్ట్ ఇచ్చే వాట్సాప్ బాట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఐటీ సంస్థల నుంచి వస్తున్న నిధులతో 22 తెలుపు రంగు ట్రాఫిక్ బైక్‌లు, ఒక టోయింగ్ వెహికల్, ఒక డ్రోన్‌ను పోలీస్ శాఖకు అందజేశాం. ఈ నెలలో దాతల నుంచి సేకరించిన సీఎస్ఆర్ ఫండ్స్‌తో 12 యాక్టివా వాహనాలను పోలీసు శాఖకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 250కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నాం. ఐటీ కారిడార్‌లో భద్రతపై పోలీస్ కమిషనర్, సంస్థ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాం.
నమస్తే తెలంగాణ: చైల్డ్, యువత భద్రతకు మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
రమేశ్ కాజా: యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యాంటి డ్రగ్స్. దీనిపై పత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చిన్నారులు, యువతుల వ్యక్తిగత భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మెంటల్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. ఐటీలో పనిచేసే ఉద్యోగులకు సీపీఆర్, ఫిట్నెస్, యోగాపై అవేర్నెస్ కల్పిస్తున్నాం. వీటితో పాటు ఒత్తిడి, డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలపై అవగాహన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం.
రోడ్డు భద్రతకు సంబంధించి సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. సమస్య ఉన్న ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీసి, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నాం. ఐటీ కారిడార్‌లో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ఐటీ కంపెనీల క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. సంస్థకు ఆయా కంపెనీల నుంచి వచ్చే ప్రతి రూపాయిపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తాం.