ఎల్బీనగర్, జూలై 1: దక్షిణ షిర్డీగా ప్రసిద్ధి గాంచిన దిల్సుఖ్నగర్లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే గురుపౌర్ణమి వేడుకలు జూలై 2వ తేదీ మొదలుకుని నాల్గవ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ట్రస్టు చైర్మన్ గుండ మల్లయ్య తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం దేవాలయంలో నిత్య పూజలతో పాటుగా ఉదయం 9 గంటలకు భక్తులచే శ్రీ సాయి లక్ష పుష్పార్చన కార్యక్రమం, ఉదయం పది గంటలకు విద్యాభివృద్ధి కోసం శ్రీ గురు పాదుకా పూజా కార్యక్రమాలను, సాయంత్రం సమయాల్లో భజన కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోమ, మంగళవారాలలోనూ బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.