సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హాస్పిటల్స్, ఐటీ, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొన్న సీపీ స్టీఫెన్ రవీంద్ర.. సైబరాబాద్ పరిధిలో వర్షం కురుస్తున్నసమయంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రోడ్లపై నీరు నిల్వకుండా జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం ఏర్పర్చుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు ఐఎండీ అధికారులు జారీచేసే వాతావరణ హెచ్చరికులను నిరంతరం పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రద్దీ రోడ్లను ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్’ (పీఎస్‌ఐఓసీ) ద్వారా నిరంతరం 24/7 పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా 8 బృందాలు పనిచేస్తున్నట్లు సీపీ వివరించారు. వరద నీరు, లోతట్టు ప్రాంతాల్లో, రోడ్లపై ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు 10 అత్యవసర బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు.
అంతే కాకుండా.. 2000 మంది ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం, వరద నీరు సాఫీగా పోయే విధంగా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పోలీసు వెబ్సైట్, వాట్సాప్, ట్విట్టర్ వేధికగా సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలిపారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ జారీచేసిన సూచనల మేరకు ఐటీతో పాటు ఇతర కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులను ఒకేసారి కాకుండా దశలవారీగా లాగౌట్ చేయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. దశలవారీగా వేర్వేరు సమయాల్లో ఉద్యోగులు లాగౌట్ కావడం వల్ల ఒకేసారి అందరు రోడ్లపైకి రాకుండా ఉంటుందని, దీనివల్ల రద్దీ తగ్గుతుందన్నారు. ఈ విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని, వానలు తగ్గే వరకు ఆయా కంపెనీల యాజమాన్యాలు ఇదే విధానాన్ని అమలు చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత వరకు కార్ల వాడకాన్ని తగ్గించి అందుబాటులో ఉన్న మెట్రో, ఇతర ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. దీంతో వర్షం లాంటి విపత్కర పరిస్థితుల్లో రోడ్లపై రద్దీని నియంత్రించ గలుగుతామని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రమేశ్ కాజా, ట్రాఫిక్ డీసీపీలు హర్షవర్ధన్, శ్రీనివాస్‌రావు, మాదాపూర్ డీసీపీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.