సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పలు రకాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలతోపాటు ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, ఈసెట్ వంటి రకరకాల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ గ్రేటర్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నగరం నలుమూలల నుంచి ప్రత్యేకంగా సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నది. దీంతోపాటు ఏయే ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయో తెలుసుకుని ఆయా ప్రాంతాల మీదుగా, విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా సిటీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పైగా విద్యార్థులు, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే సిటీ బస్సుల గురించి తెలుసుకోవడం కోసం కోఠి, రేతిఫైల్ బస్టాండ్లలో రెండు ప్రత్యేక సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ రెండు సహాయ కేంద్రాల సహాయకులను ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ ఫోన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నది. దీంతో ఏ ఏ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది..? ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే ఏ ప్రాంతం నుంచి ఏ సిటీ బస్సు వెళ్తున్నది వంటి వివరాలు సహాయ కేంద్రాలు, మొబైల్ సౌకర్యం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరగడం, అధిక ఆదాయం రావడంతోపాటు ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీ సిటీ బస్సులు ఉండేలా నిరంతరం చర్యలు తీసుకుంటున్న అధికారులు చెప్పారు.
నేడు ‘ఈసెట్-2023’ ప్రవేశ పరీక్ష.. ప్రత్యేక బస్సులు..
పరీక్షలకు ప్రత్యేక సేవలందించడంలో భాగంగా నగరంలో ఈనెల 20వ తేదీన శనివారం నిర్వహించనున్న ఈసెట్-2023కు హాజరయ్యే వారి కోసం కూడా ప్రత్యేక సిటీ బస్సులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి తెలిపారు. అందుకోసం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు పూటలూ టీఎస్ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అనుగుణంగా సిటీ బస్సులు నడిపిస్తామన్నారు. బస్సుల రాకపోకలు గురించి తెలుసుకోవడానికి కోఠిలో 99592 26160, రేతిఫైల్ బస్టాండ్లో 99592 26154 మొబైల్ నంబర్లలో సంప్రదించాలన్నారు.