TGSRTC | మియాపూర్, జూన్ 11: ప్రసిద్ధ దేవాలయాలకు మియాపూర్-1 డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి శని, ఆదివారాల్లో తెలంగాణలోని ప్రముఖ దేవాలయలు అయిన యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, జైన మందిర్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాల గుడి, లక్నవరం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, బొగత జలపాతం, మేడారం రామప్ప ఆలయ సందర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. రెండురోజుల్లో వీటన్నింటినీ దర్శనం చేసుకునేవిధంగా సూపర్ లగ్జరీ బస్సుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని నడుపుతున్నట్లు చెప్పారు.
ఈ ప్రత్యేక బస్సులు మియాపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయల్దేరి దర్శనాల అనంతరం మరుసటి రోజు రాత్రి 10 గంటలకు మియాపూర్ డిపో చేరుకుంటుందని తెలిపారు. ఇందుకుగానూ ఒక్కొక్కరికి రూ.2000 ఛార్జీ వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎం మోహన్రావు కోరారు. పూర్తి వివరాలకు 85003 09052,76590 29882,99592 26153 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 30 మందికి మంచి భక్తులు ఉంటే ఏ రోజైనా ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తామని చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం ప్రతి శని, ఆదివారాల్లో ఏపీలోని ప్రసిద్ధ దేవాలయాలు విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వైజాగ్, అరకు నాలుగు రోజుల్లో దర్శనం చేసుకునేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులతో ప్రత్యేక టూర్ ప్యాకేజీ నడపుతున్నట్లు డీఎం మోహన్రావు వివరించారు. ఈ బస్సు మియాపూర్ నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు బయల్దేరి దర్శనాల అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు మియాపూర్ డిపో చేరుకుంటుందని అన్నారు. ఒక్కో ప్రయాణికుడికి చార్జి రూ.4వేలు వసూలు చేయనున్నట్లు చెప్పారు.