సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రైళ్లు ఢీ కొట్టుకునే ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు ‘కవాచ్’ విధానంపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. ఈ అంశంపై ఇండియన్ రైల్వే బోర్డుకు సంబంధించిన భద్రతా విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ రవీందర్ గుప్తా సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ విధానాన్ని తీసుకురావడం తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. రైళ్లకు సంబంధించిన పలు రకాల భద్రతా చర్యలపై సమగ్రంగా సమీక్షించామని, జోనల్ వారీగా భద్రత చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్సీఆర్ జోన్ ఆధ్వర్యంలో ఉన్న ఆరు డివిజనల్ రైల్వే మేనేజర్లు, రీజియన్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.