సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ-ఉప్పలూరు మధ్య విద్యుదీకరణ పనులతో పాటు డబుల్ లైన్ పనులు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నుంచి విజయవాడ- ఉప్పలూరు మధ్య 17 కిలో మీటర్ల డబుల్ లైను అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ- గుడివాడ- భీమవరం స్టేషన్ల మధ్య, గుడివాడ-మచిలీపట్నం స్టేషన్ల మధ్య మొత్తం 141 కిలో మీటర్ల మేర నిరంతరాయంగా రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- గుడివాడ- భీమవరం- నర్సాపూర్, గుడివాడ- మచిలీపట్నం- నర్సాపూర్- నిడదవోలు డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేశారు. రూ.3,000 కోట్ల అంచనా వ్యయంతో 221 కిలో మీటర్ల దూరం గల ఈ ప్రాజెక్టు 2011-12లో మంజూరైనట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో ఉన్న రైల్వే ట్రాకుల డబ్లింగ్ వల్ల వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.