ఔటర్ మార్గంలో రూఫింగ్ కారిడార్
21 కిలోమీటర్ల నిర్మాణం.. హెచ్ఎండీఏ ప్రతిపాదన
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగు రోడ్డుపై సోలార్ రూఫ్ టాపింగ్ కారిడార్‌ను నిర్మించాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8 కి.మీ, నార్సింగి నుంచి కొల్లూరు వరకు మరో 13 కి.మీ పొడవునా ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లను విస్తరించే పనులు చేపట్టారు. దీంతో పాటు సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. దీనికి అదనంగా సైకిల్ ట్రాక్‌పై సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 9 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను హెచ్ఎండీఏ అధికారులు రూపొందించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో…
ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హెమ్ సౌత్ కొరియాలో రోడ్డు మధ్యలో ఉన్న సొలార్ ప్యానళ్లతో కూడిన సైకిల్ ట్రాక్ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన మంత్రి కేటీఆర్ ఇదే తరహా నిర్మాణాన్ని ఔటర్ రింగు రోడ్డు పొడవునా 21 కి.మీ మేర ప్రతిపాదించిన సైకిల్ ట్రాక్‌పై ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని పురపాలక శాఖ కమిషనర్ అర్వింద్‌కుమార్‌కు రీ ట్వీట్ చేశారు. వెంటనే దీనికి స్పందించిన ఆయన హెచ్ఎండీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోభాగంగానే సోలార్ రూఫ్ టాప్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.