సరదాలు వదిలి బస్తీలకు కదిలి.. జీతంలో కొంత సేవా కార్యక్రమాలకు..
పేదలకు పండ్లు, దుస్తుల పంపిణీ.. ఆదర్శంగా నిలుస్తున్న ఐటీ ఉద్యోగులు
వీకెండ్ వచ్చిందంటే చాలు చిల్ అవ్వడమెలా? అని ఆలోచిస్తారు. వారాంతం పార్టీల సెలబ్రేషన్స్‌పై దృష్టి సారిస్తారు. ఇలా ఆలోచించే బ్యాచీలు అనేకం. వారంతంలో టూర్లు, పార్టీలు, పబ్‌లు ఇలా సరదాగా గడపాలనే ఆశ చాలా మందిది. కానీ కొంతమంది
ఉద్యోగులు ఆ వారాంతం సంతోషాన్ని సేవా కార్యక్రమాల్లో వెతుకుంటున్నారు. జీతంలో కొంత ఆదా చేసి నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నారు.
శని, ఆదివారాల్లో నగరంలోని పలు బస్తీలు, కాలనీలు సందర్శిస్తూ పండ్లు, మిఠాయిలు, దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందిస్తున్నారు. వేడుకలను తగ్గించుకుని విరివిగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఐటీ, ఫార్మ ఉద్యోగులు వీకెండ్‌ను సర్వీస్ డేగా మార్చుకునే కల్చర్ ఇటీవల పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా తాము నిర్వహించే కార్యక్రమాలను
ముందుస్తుగానే ప్రకటించి సదరు ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
కరోనా ఆపత్కాలంలో అనేక కష్టాలు చూశాం. చాలా మంది తిండి లేక అవస్థలు పడ్డారు. ఉపాధి లేక దిగులు చెందారు. జీవితంలో అలాంటి సంఘటనలు చూస్తామనుకోలేదు. కరోనా కష్టాలను చూసిన తర్వాత సరదాల విషయం చాలా చిన్నగా కనిపించింది. వీకెండ్ పార్టీల పేరుతో చాలా మంది డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ ఆ డబ్బును అవసరమున్న వారికి అందిస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. మేం ప్రతీ వీకెండ్లో నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు పంపిణీ చేయడం మొదలుపెట్టాం. 9963741518 నెంబర్‌కు ఫోన్ చేస్తే అవసరమున్న ప్రతి ఒక్కరికి అందిస్తాం.
సహాయం అనేది ఎంత విలువైనదో కరోనా కష్టకాలం మనకు నేర్పింది. ఒకరికొకరూ అండగా నిలవకపోతే లాక్డౌన్ లాంటి భయానక రోజులను దాటేవాళ్లం కాదు. అందుకే మనకు ఉన్నదాంట్లో కొంత నిరాశ్రయులకు సాయం అందించాలి. ప్రతి నెల 150 మంది వితంతువులకు ఫయాజ్ చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. సురక్ష మిషన్ ద్వారా బాలికల ఆశ్రమంలో వారికి అత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి నెల పది కేజీల రైస్..పప్పులు పంపిణీ చేస్తాం. నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. దుబారా ఖర్చు తగ్గించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఇతరులకు సహాయం చేయడంలోనే అసలైన సంతోషం ఉంది. 9059695714 నెంబర్‌కు ఫోన్ చేస్తే మాకు వీలైనంత సాయం అందిస్తాం.
నాకు వచ్చే జీతంలో 25 శాతం సహాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాను. ఆకలి విలువ నాకు తెలుసు. నేను సంపాదించిన ప్రతి రుపాయిలో కొంత సహాయం చేయడానికి వెచ్చిస్తాను. పార్టీలు చేసుకుని వాటి పేరుతో దుబారా చేసే బదులు నిరాశ్రయులకు సహాయం చేస్తే బాగుంటుంది. వీకెండ్లో అనాథలకు రైస్, కర్రీ, సాంబర్, పెరుగుతో ఆహార పాకెట్లను పంపిణీ చేస్తున్నాను. ఆకలితో ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను. సమాజ శ్రేయస్సు కోసం జరిగే ప్రతీ కార్యక్రమంలో నా పాత్ర ఉండాలని అనుకుంటా. ఆకలితో బాధపడే వారు 8688577703 నెంబర్‌కు ఫోన్ చేస్తే మేం వారికి ఆహారం అందిస్తాం. – పావనీ, ఫార్మసీ ఉద్యోగి.
వీకెండ్లో తప్పనిసరిగా నగరంలోని ఒక బస్తీకి వెళ్లి అక్కడ మాకు వీలైనంత సాయం చేస్తాం. ఎక్కువగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. కొన్ని సమయాల్లో ఫుడ్ కూడా అందిస్తాం. మాస్క్‌లు, మెడిసిన్స్ ఇస్తాం. వీకెండ్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్నేహితుల నుంచి మంచి స్పందన ఉంటుంది. శుక్రవారం రోజు ఎక్కడికి వెళ్లాలనేది నిర్ణయించుకుంటాం. నిరుపేదలు ఉన్న వివరాలు మాకు చెబితే మేం ఏదో ఒక వీకెండ్ ఆ ప్రాంతంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తాం. 9177449203 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెబితే మేం పరిశీలిస్తాం. – మధు, ఐటీ ఉద్యోగి