కేపీహెచ్‌బీ కాలనీ, మే 28: నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని పునరావాస కేంద్రానికి తరలించి కూకట్పల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ కేఎన్ రాజు మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆంజనేయులు(65) అనే వృద్ధుడు భిక్షాటన చేస్తూ స్థానికంగా నివసిస్తున్నాడు. కుష్టు వ్యాధిగ్రస్థుడైన ఇతడు గతంలో రాందేవ్రావ్ వైద్యశాల ఆవరణలోని రాణీ కుముదిని కుష్టు వ్యాధిగ్రస్థుల పునరావాస కేంద్రంలో కొద్ది రోజుల పాటు చికిత్స పొంది బయటకు వచ్చాడు. నెల రోజులుగా రోడ్డు పక్కనున్న బస్టాపులో నివసిస్తూ భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. కరోనా లాక్డౌన్ రావడంతో ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ రాజు ఆహార ప్యాకెట్లు, పండ్లు, ఫలాలను అందిస్తూ బాగోగులు చూస్తున్నాడు. రెండ్రోజులుగా ఆ వృద్ధుడు లేవలేని స్థితిలో ఉండటంతో రాజు పునరావాస కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి తిరిగి.. ఆ కేంద్రంలో చేర్పించేందుకు ఒప్పించాడు. అతడిని అంబులెన్స్‌లోకి ఎక్కించి పునరావాస కేంద్రానికి తరలించాడు.