సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ ): ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న నానుడిని నిజం చేస్తున్నారు నగరంలోని కొందరు సేవాతత్పరులు. కరోనా కష్టకాలంలో అయినవారు పట్టించుకోకపోయినా.. బంధువులు, బంధాలు దూరం అవుతున్నా, రక్త సంబంధీకులు సైతం విస్మరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందుకు వచ్చి కొవిడ్ బాధితులకు మనోధైర్యాన్నిస్తున్నారు..ఒక్కొక్కరిది ఒక్కో దారి..అయినా అందరి గమ్యం మాత్రం కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడమే..పలు విధాలుగా ఆపన్నులకు అండగా నిలుస్తున్న వీరి స్ఫూర్తి పలువురికి ఆదర్శం కావాలి..
మహమ్మారి మారణ హోమం సాగిస్తున్న ఈ గడ్డు పరిస్థితుల్లో అమ్మలా అన్నం అందిస్తున్నది వేదం ఫౌండేషన్.. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదనే మాత్రమే కాదని, మంచితనమే మానవ జన్మ పరమార్థమని భావించిన అర్వింద్ అలిశెట్టి వేదం ఫౌండేషన్ ద్వారా సేవా థృక్పథాన్ని చాటుతున్నాడు..ఆరుగురితో బృందంగా ఏర్పడి కొవిడ్ బాధితులకు అండగా నిలబడుతున్నారు. కొవిడ్ వ్యాధిగ్రస్తులతో పాటు కరోనా పోరులో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న దవాఖాన సిబ్బందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిశుభ్రంగా ఉన్న వ్యక్తులతో పౌష్టికాహారం తయారు చేయిస్తూ , శాస్త్రీయమైన పద్ధతిలో భోజన ప్యాక్‌ను అందిస్తున్నారు. స్విగ్గి లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కొవిడ్ రోగులకు ఇంటికే భోజనాలను అందించడంతో పాటు నిమ్స్, టిమ్స్, గాంధీ దవాఖానాల వద్ద కొవిడ్ రోగుల బంధువులు, దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు ఈ భోజన ప్యాక్‌ను అందిస్తున్నారు. నిత్యం వెయ్యి భోజనాలు అందిస్తున్నామని, సేవలో సంతృప్తి ఉందని ఆర్వింద్ ఈ సందర్భంగా అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఉచిత భోజన వితరణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. వివరాలకు 99855 88821/31/ 41లలో సంప్రదించవచ్చని తెలిపారు.
మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ వద్ద ఉన్న మెడికవర్ దవాఖానలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, డాక్టర్లకు 200కు పైగా భోజనాలను నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ అందించింది. కొవిడ్ సమయంలో విశేషంగా సేవలందిస్తున్న సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, వలంటీర్లు, హెల్త్‌కేర్ వర్కర్లకు ఆత్మీయ ఆతిథ్యం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్‌కు సురక్షితమైన , పోషక విలువలతో కూడిన భోజనం అందించడం తక్షణావసరం అని భావించామని నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ మనీష్ దయ్యా పేర్కొన్నారు.