బడంగ్పేట్, నవంబర్19ః ఎస్ఎన్డీపీ పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని నబిల్ కాలనీ, షాహిన్నగర్లో జరుగుతున్న ఎస్ఎన్డీపీ నాలా పనులను ఆమె బుధవారం పరిశీలించారు. కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలా పనులు జాప్యం కావడానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయకపోవడం వల్లే వర్షాకాలంలో కాలనీలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. వర్షం నీరు, మురుగు నీరు రెండు కలిసి రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ఇండ్లలో ఉండలేని పరిస్థితి వచ్చిందన్నారు.
కాలనీ ప్రజల నుంచి ప్రతిరోజూ ఫిర్యాదులు వచ్చాయన్నారు. పనులు మొదలు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. డ్రైనేజీ లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. డ్రైనేజీ రోడ్లపై పారడంతో స్థానికులు వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. ప్రజల ఆనారోగ్యం పాలవుతుంటే పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. నాలా పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుక రావాలని ఆదేశించారు. నాలా పనులపై సమీక్ష చేయాలన్నారు. తక్షణమే పనులు పూర్తి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో కమిషనర్ వెంకట్రామ్, డీఈ అయేషా, బీఆర్ఎస్ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి, అబ్ధులా, నబీల్ తదితరులు ఉన్నారు.