చేవెళ్ల టౌన్, జూలై 2 : అచ్చం ‘పుష్ప’ మూవీలో ఎర్ర చందనాన్ని వాహనంలో రహస్యంగా దాచి..ఎలాగైతే స్మగ్లింగ్ చేసే సీన్ ఉందో.. అచ్చం అలాగే తెల్ల చందనం చెకలను అక్రమంగా రవాణా చేస్తూ.. ముగ్గురు మాదాపూర్ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులకు చిక్కారు. బుధవారం ఏసీపీ కిషన్ చేవెళ్ల పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా ఉంత్వాడి గ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్ల పల్లిలో ఉన్న‘ఆంధ్రా పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ’కి అక్రమంగా గంధం చెకలు తరలిస్తున్నట్లు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే చేవెళ్ల పోలీసులతో కలిసి మండల పరిధిలోని బస్తేపూర్ గేట్ వద్ద నేషనల్ హైవే 163పై వాహనాల తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, మొదట ఖాళీగా కనిపించింది. అయితే డ్రైవర్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి పూర్తిస్థాయిలో తనిఖీ చేయగా, డ్రైవర్ క్యాబిన్ వెనుక భాగంలో కంటైనర్ టైపులో రహస్య విభాగం కనిపించింది. దాన్ని తెరిచి చూడగా, ఫర్టిలైజర్ బ్యాగుల్లో చిన్న చిన్న చెక ముకలు ఉన్నాయి.
అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వగా.. వాటిని సాంటాలమ్ అల్బమ్ శాస్త్రీయ పేరు కలిగిన తెల్ల చందనంగా నిర్ధారించారు. వెంటనే డీసీఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ సూపర్ వైజర్ కేవీపీ షుహైబ్, అమ్మిన వ్యక్తి విజయ్ హన్మంత్ మానేను అదుపులోకి తీసుకొని.. వాహనాన్ని సీజ్ చేసి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాలుగు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ తెల్ల చందనం చెకలు టన్ను (1000 కిలోలు) బరువున్నాయని, వీటి విలువ రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ తెలిపారు. ముగ్గురు నిందితులతో పాటు ఫ్యాక్టరీ ఓనర్ నాగర్ గూడకు చెందిన అబ్దుల్లా కున్హి, మేనేజర్ సాధిక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ ఓనర్, మేనేజర్ పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, మాదాపూర్ ఎస్వోటీ ఇన్ స్పెక్టర్ సంజయ్, ఎస్సై సతీశ్ రెడ్డి, చేవెళ్ల ఎస్సై శీరిష, చిలూరు ఫారెస్ట్ ఆఫీసర్ రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.