Street Vendors | అడ్డగుట్ట, ఫిబ్రవరి 21 : ‘రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలను సాగిస్తున్నాం.. మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండయ్యా’ అని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు నగర వీధి వ్యాపారులు. గత నాలుగు నెలలుగా పోలీసుల వేధింపుల వల్ల తాము రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలను చేసుకోలేక పోతున్నామని మెట్టుగూడ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను నిర్వహించుకునేవారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోడు వెళ్లబోసుకున్నారు.
శుక్రవారం మెట్టుగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో మెట్టుగూడ – తార్నాక మీల్స్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింత రమేశ్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఆలుగడ్డ బావి బస్‌స్టాప్ నుండి తార్నాక ఆఫీసర్స్ క్లబ్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నామని వారు తెలిపారు. చిరు వ్యాపారాల జీవనోపాధి, క్రమబద్ధీకరణ చట్టం 2014లోని చాప్టర్ 2 లోని 3(3)ప్రకారం ఏ చిరు వ్యాపారిని కూడా తొలగించరాదని చట్టం స్పష్టంగా చెబుతుందున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2014 ప్రకారం ఈ ప్రాంతంలో సర్వే చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తమకు గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి ధ్రువపత్రాలు అందించినట్టు తెలియజేశారు.
మెట్టుగూడ ప్రధాన రహదారికి అటు ఇటూ 120 కి పైగా కుటుంబాలు 20 ఏళ్లకు పైగా చిరువ్యాపారాలు చేస్తున్నాయని చింత రమేశ్ వెల్లడించారు. నానాకష్టాలు పడీ ఏ రోజుకారోజు బతుకులను వెళ్లదీస్తుంటే అకస్మాత్తుగా పోలీసులొచ్చి తమ బండ్లను తొలగిస్తే బతికేదెలా? అని ప్రశ్నించారు. తమకు వ్యాపారం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ అనుమతి కూడా ఇచ్చిందని కానీ పోలీసులు మాత్రం తమను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా వ్యాపారం లేకపోవడంతో ఫైనాన్స్ తీసుకున్న డబ్బులు చెల్లించలేక లలిత అనే చిరు వ్యాపారి ఒత్తిడి భరించలేక గుండెపోటుతో మరణించిందని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 4 నెలలుగా తమకు కుటుంబ పోషణ కష్టమవుతున్నదని, ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయని చెప్పారు.
చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బండ్లను తొలగిస్తున్నారని సమాచారం అందుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ రాచూరి సునీత అక్కడికి చేరుకొని చిరు వ్యాపారులకు మద్దతుగా నిలిచారు. 20 ఏళ్లుగా వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వారిని వ్యాపారాలు ఏర్పాటు చేసుకోకుండా ఆటంకాలు సృష్టించడం సరైనది కాదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని, ఇది సరైనది కాదని ఆమె అన్నారు. చిరు వ్యాపారులకు వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే అంతవరకు తను స్ట్రీట్ వెండర్స్ వైపు పోరాటాన్ని సాగిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ఇదంతా జరుగుతున్నదని, కక్ష సాధింపు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని ఆమె హితవు పలికారు.
వ్యాపారం చేసుకుంటే కానీ బతకలేని జీవితాలు మావి. 4 నెలలుగా వ్యాపారాలు బంద్ కావడంతో కుటుంబ నిర్వహణ కష్టమవుతున్నది. వ్యాపారాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అని ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వ్యాపారాలను నిర్వహించుకుంటామని స్పష్టంగా చెప్పిన వారు వినడం లేదు.
– దుర్గా, చిరు వ్యాపారి
వ్యాపారాలను నిర్వహించుకుంటేనే జీవితాలు సాఫీగా గడిచే బతుకులు మావి. అధికారులు దయతలిచి మాకు రోడ్డు పక్కన వ్యాపారాలను నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించండి. మీకు జీవితాంతం మా కుటుంబాలు రుణపడి ఉంటాయి.
– సరిత, చిరు వ్యాపారి