సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు చేపట్టే శిల్పా లే అవుట్ రెండో దశ పనులను మే చివరి వరకు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావుతో కలిసి ఆయన మల్కం చెరువు, శిల్పా లే అవుట్ రెండో దశ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు మూడు వరుసల బై డైరెక్షన్ శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్లై ఓవర్.. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్‌కు, కొండాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు, హైటెక్ సిటీకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తున్నదని అధికారులు వివరించారు. ఫ్లై ఓవర్ పూర్తికి ఎంత సమయం పడుతందని అడగ్గా.. ప్రస్తుతం బీటీ, ఎల్ఈడీ లైట్ల పనులు కొనసాగుతున్నాయని..
సుమారు ఐదు ఆస్తులకు సంబంధించిన భూ సేకరణ పూర్తి అయితే 15 రోజుల్లో సర్వీస్ రోడ్డు పూర్తి అవుతుందని ఇంజినీర్లు తెలపడంతో ఈ నెల చివరాఖరు వరకు పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. మరోవైపు మల్కం చెరువు వద్ద శానిటేషన్, కుక్కల బెడదపై వాకర్లు ఫిర్యాదు చేయగా వెంటనే నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ చెరువులోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాజాగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హెచ్సిటీ ప్రాజెక్టు ద్వారా చేపట్టే ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణ స్థలాన్ని కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో జోనల్ ఎస్ఈ శంకర్ నాయక్, డీసీ ప్రశాంతి, ప్రాజెక్టు ఈఈ నమ్యా నాయక్, డిప్యూటీ ఈఈ హరీష్, యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.