సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ) : నగరంలో మహిళలను వేధిస్తున్న 289 మందికి హైదరాబాద్ విమెన్ సొసైటీ విభాగం షీటీమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మహిళలపై వివిధరకాలుగా వేధింపులకు పాల్పడిన వారికి మనోజాగృతి సంస్థతో కలిసి ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డా.లావణ్య తెలిపారు. యువత డ్రగ్స్, ఆల్కహాల్‌తో పాటు చెడు స్నేహాల వల్ల చెడిపోతుందని, దీనివల్ల వారి క్యారెక్టర్‌తో పాటు విచక్షణ కోల్పోతున్నారని ఇది ప్రతిఒక్కరూ గ్రహించి సమాజంలో గౌరవంగా మెదలుకోవాలని కౌన్సిలింగ్‌కు హాజరైన వారిని ఉద్దేశించి లావణ్య తెలిపారు.
ఈ కౌన్సిలింగ్‌కు హాజరైన కొందరు మాట్లాడుతూ తమ ప్రవర్తన వల్ల చాలా మంది బాధపడ్డారని, తమ వల్ల తమ కుటుంబాల పరువు కూడా పోతున్నదని, భవిష్యత్‌లో ఇలాంటివి చేయమని చెప్పారు. కౌన్సిలింగ్ తీసుకున్న వారిలో 271 మంది మేజర్లు, 18 మంది మైనర్లు ఉన్నారని వీరితో పాటు 15మంది పేరెంట్స్కూడా పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాచల్లా, కైరి త్రినాథ్ గౌడ్, స్వాతినశశి, శ్రీలత, సయ్యద్ అబీదాబేగమ్ తదితరులు పాల్గొన్నారు.