మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీల భరతం పడుతాయి రాచకొండ షీ టీమ్స్. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టే వారి తాట తీస్తున్నాయి. ఎనిమిది వారాల్లో మొత్తం 57 ఫిర్యాదులు రాగా, దర్యాప్తు చేపట్టి.. 27 ఘటనలపై ఎఫ్ఐఆర్లు, మరో 29 ఫిర్యాదులపై పెట్టీ కేసులు నమోదు చేశాయి. ఓ కౌన్సిలింగ్ కేసును సైతం అధికారులు నమోదు చేశారు. మొత్తం 49 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు మైనర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారందరికీ వారి కుటుంబసభ్యుల సమక్షంలో షీ టీమ్స్, మానసిక నిపుణులు, భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రాచకొండ పోలీస్ కమిషనర్ ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లగూడెం గ్రామంలో ఉంటున్న కె. కుమారస్వామి అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న బాత్రూమ్ ఎక్హ్సాస్ట్ ఫ్యాన్ వద్ద మొబైల్ కెమెరాను ఆన్ చేసి పెట్టాడు. ఆ ఇంటి మహిళ స్నానం చేస్తుండగా, ఫ్లాష్ లైట్ వెలిగింది. ఇది పసిగట్టిన బాధితురాలు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు కుమారస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నగరానికి చెందిన ఓ విద్యార్థిని(21) గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నది. ఇటీవల పరీక్షల కోసం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా, ఆమె క్లాస్మేట్ పద్మా సుధీర్ తన గదికి రావాలని, ప్రేమించాలని వేధించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని ఫోన్ ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన షీ టీమ్స్ పోలీసులు పద్మా సుధీర్‌ను ఎల్బీనగర్ వద్ద అరెస్ట్ చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు నెలల్లో మొత్తం 9 బాల్య వివాహాలను షీ టీమ్స్ అడ్డుకున్నాయి. భువనగిరి-2, చౌటుప్పల్-04, ఇబ్రహీంపట్నం-1, ఎల్బీనగర్-2 ఉన్నాయి. పోలీస్ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి మొత్తం 115 బాల్య వివాహాలను షీ టీమ్స్ అడ్డుకొన్నాయి.
పోకిరీల ఆగడాలు, లైంగిక వేధింపులు.. ఇలా ఏ ఆపద వచ్చినా.. బాధితులు రాచకొండ వాట్సాప్ నం. 9490617111 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం. బాధితుల సమాచారం గోప్యంగా ఉంచుతాం.- మహేశ్‌భగవత్, రాచకొండ సీపీ