శంషాబాద్ రూరల్, మే 7: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ సూచించారు. శంషాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రాళ్లగూడ, పాత శంషాబాద్ తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీసీపీ రాజేశ్ మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఏవైనా దాడులు జరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై వాహనాల మీద వెళ్లే సమయంలో దాడులు జరిగితే తప్పించుకోవడానికి సమీపంలోని భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని అన్నారు. ఒకవేళ ఇంట్లో ఉన్న సమయంలో గ్యాస్ సిలిండర్ బంద్ చేసి పెట్టాలన్నారు. ఇలాగే పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.