బంజారాహిల్స్,మే 12: బంజారాహిల్స్ రోడ్ నం. 11లో నాలా బఫర్ జోనల్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంపై నమస్తే తెలంగాణ పత్రిక సోమవారం ‘నగరం నడిబొడ్డున నాలాకు ముప్పు’ పేరుతో ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారంపై షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు లోతుగా పరిశీలన చేపట్టగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడాల్సిన నీటి పారుదలశాఖ అధికారులు సరైన పరిశీలన చేయకుండానే ఎన్వోసీ జారీ చేసినట్లు బయటపడింది. దీంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం రెవెన్యూ క్లియరెన్స్ లేకుండానే ఏకంగా ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్లు తేలడంతో కలకలం చెలరేగింది. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్రమైన వివరాలతో షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపించారు.
ఉదయ్‌నగర్ నాలాకు ఎగువ భాగంలో మిథిలానగర్ కాలనీలో గున్నా జైదీప్‌రెడ్డి, గున్నా సందీప్‌రెడ్డి తదితరులు సుమారు 1200 గజాల స్థలం చుట్టూ ఆదివారం ఫెన్సింగ్ వేశారు. ఈ స్థలాన్ని శివరాజ్ ఠాకూర్ అనే బిల్డర్‌కు డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. అయితే ఫెన్సింగ్ వేసిన స్థలాన్ని ఆనుకుని ఉదయ్‌నగర్ నాలా ఉందని, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలం మొత్తం సర్వే నంబర్ 403 లోని టీఎస్-నెంబర్ 2, వార్డు -11, బ్లాక్-ఎస్‌లోకి వస్తుందని, టీఎస్ఎల్ఆర్ ప్రకారం ఈ స్థలం మొత్తం ప్రభుత్వానిదే అని సోమవారం షేక్‌పేట మండల రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలింది. గున్నా జైదీప్‌రెడ్డి, సందీప్‌రెడ్డి తదితరులు జీహెచ్ఎంసీ అనుమతి కోసం సమర్పించిన డాక్యుమెంట్స్‌లో తమ స్థలం టీఎస్ నంబర్ 29, బ్లాక్-ఓ, వార్డు-11 కిందకు వస్తుందని పేర్కొన్నారని.. అది నాలా పక్కనున్న స్థలం కాదని, మిథిలానగర్‌కు ఎగువభాగంలో ఉన్న స్థలమని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించామని, జీహెచ్ఎంసీ ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని జోనల్ కమిషనర్‌కు లేఖ రాశామని షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు.
ఉదయ్‌నగర్‌లో నాలాను ఆనుకుని ఉన్న స్థలంలో రెవెన్యూ క్లియరెన్స్ కోరకుండానే జీహెచ్ఎంసీ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. 2023 డిసెంబర్లో శివరాజ్ ఠాకూర్ పెట్టిన దరఖాస్తులను అప్పటి జోనల్ కమిషనర్ తిరస్కరించారని తేలింది. అయితే 2025 జనవరిలో మరోసారి దరఖాస్తు చేశారు. సర్వే నంబర్ 403లోని స్థలం ప్రభుత్వ స్థలంగా రెవెన్యూ రికార్డులో ఉంటుందని, దానిలో దరఖాస్తు వస్తే వెంటనే రెవెన్యూ క్లియరెన్స్ తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ ఆ పనిచేయకుండా దరఖాస్తు వచ్చిన వెంటనే అనుమతి ఇవ్వడంలో ఆంతర్యమేమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఇన్చార్జి జోనల్ కమిషనర్‌తో పాటు సిటీ ప్లానర్ సాంబయ్య, సర్కిల్ -18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు సోమవారం నాలాను పరిశీలించారు.
నీటిపారుదల శాఖ ఇచ్చిన ఎన్వోసీలోని వివరాలకు, జీహెచ్ఎంసీ అనుమతి కోసం స్థలం యజమానులు ఇచ్చిన వివరాల్లో తేడాలు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. 2023 అక్టోబర్‌లో నీటిపారుదలశాఖ అధికారులు జారీ చేసిన ఎన్వోసీలో ఇక్కడ నాలా విస్తీర్ణం కేవలం 3.70 మీటర్లు మాత్రమేనని పేర్కొన్నారు. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉదయ్‌నగర్ నాలా విస్తీర్ణం సుమారు 15 నుంచి 20 మీటర్ల దాకా ఉందని తేలడంతో మరింత లోతుగా విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు నిర్మాణదారులు ఇచ్చిన దరఖాస్తులో తమ స్థలం టీఎస్ 29, బ్లాక్-ఓ, వార్డు -11 కిందకు వస్తుందని చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా ఏకంగా ప్రభుత్వ స్థలంలో ఎన్వోసీ ఎలా జారీ చేశారనే అంశం చర్చనీయాంశంగా మారింది.