మైలార్దేవపల్లి, సెప్టెంబర్ 20: ఆ కాలనీలు గత మూడు నెలలుగా తాగునీటి సరఫరాలో డ్రైనేజీలు నీరు కలుస్తూ వస్తున్నాయి. అసలే మంచినీటి సరఫరా అంతంత మాత్రం, పైగా సరఫరా చేసిన ప్రతిసారి కలుషిత నీటిని సరఫరా చేయడంతో స్థానికంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నట్టు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ఇలాంటి కలుషిత నీటిని తాగడం వల్ల ఆసుపత్రుల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
ఇదేమని ప్రశ్నించిన స్థానికులపై లైన్మెన్లు, జల మండలి అధికారులు బెదిరింపులకు దిగుతూ ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోండి అంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నీటి సరఫరా జరిగిన అనంతరం, మంచినీటిని తీసుకొని రోడ్డుపైకి వచ్చి వృద్ధులు, మహిళలు, చిన్నారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ‘ఇవే నీరు మీరు తాగుతారా?’ అని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.
మైలార్దేవపల్లి డివిజన్ ఆదర్శ, ఆప్కో కాలనీలలో కొంత కాలంగా తాగునీటి సరఫరాలో కలుషిత నీరు వస్తుందని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అయినా, ఎవరు స్పందించకపోవడంతో కాలనీ వాసులు శుక్రవారం రోడ్డెక్కారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంటుందని వాటర్ వర్క్స్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు.
వర్షాలు కురుస్తూ, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితుల్లో తాగునీరు కలుషితమై రావడం పట్ల రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టించుకోని ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలపై చిన్న చూపు చూడటం బాధాకరమని, అధికారులు స్పందించి పైపులైన్ పనులు చేపట్టి, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో జల మండలి కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.