హైదరాబాద్, ఆట ప్రతినిధి, నవంబర్ 8: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి స్టాన్లీ జోన్స్ మంగళవారం ప్రకటించారు. నవంబర్ 11 నుంచి 15 వరకు గువాహటిలో జరగనున్న ఈ పోటీల్లో తలపడనున్న పురుష, మహిళల జట్టు సభ్యులకు హైదరాబాద్ రన్నర్స్ అండ్ బ్యాంకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిజిత్, కార్యదర్శి వేణుగోపాల్ రాజు, తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సారంగపాణి కిట్లను పంపిణీ చేశారు.
సీనియర్ టెన్నికాయిట్ జట్లు..
జాతీయ సీనియర్ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్లను రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి కేఆర్వీ శ్యామ్సుందర్ ప్రకటించారు. పురుషుల జట్టుకు ఎన్.తేజరాజు, ఎన్.ప్రవీణ్, టి.శరత్, కె.ప్రభుదాస్, ఎండి.యాసీన్, టి.అర్జున్.. మహిళల జట్టుకు కె.శిరీష, కె.త్రిష, మానస, సిరివెన్నెల, యాదమ్మ ఎంపికయ్యారు.
వన్ డే లీగ్ చాంప్లోసికింద్రాబాద్ శుభారంభం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఏ-డివిజన్ వన్ డే లీగ్ క్రికెట్ చాంపియన్షిప్ సీజన్ తొలి మ్యాచ్లో సికింద్రాబాద్ క్లబ్ జట్టు శుభారంభం చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఆల్ సెయింట్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆల్ సెయింట్స్ జట్టు 117 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్కు దిగిన సికింద్రాబాద్ క్లబ్ జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో అనురాగ్ హరిదాస్ 56 పరుగులు చేశాడు. మరో మ్యాచ్లో యూత్ సీసీ జట్టు 119 పరుగుల ఆధిక్యంతో అంబర్పేట సీసీ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూత్ సీసీ జట్టు 198 పరుగులు చేయగా, అంబర్పేట జట్టు 79 పరుగులు మాత్రమే చేసింది.
తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న సతీశ్ గౌడ్
తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.సతీశ్ గౌడ్ ఈ నెల 14వ తేదీ జరిగే తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నారని తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.